Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనపర్తి జిల్లా ముందరి తండాలో ఘటన
- పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించిన తండావాసులు
నవతెలంగాణ -పెద్దమందడి
విద్యుత్ బిల్లుల కలెక్షన్లకు వెళ్లిన అధికారులను తండావాసులు నాలుగు గంటలపాటు నిర్బంధించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ ఘటన శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని ముందరి తండాలో జరిగింది. విద్యుత్ బిల్లుల బకాయి వసూలు కోసం ఏఈ శ్రీకాంత్ శర్మ, నలుగురు లైన్మెన్లు తండాకు వెళ్లారు. అయితే, గ్రామపంచాయతీ కార్యాలయంలో మాట్లాడుకుందామని చెప్పిన తండావాసులు వారిని నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు వెళ్లి స్థానికులతో మాట్లాడారు. విద్యుత్ శాఖ అధికారులతోనూ చర్చలు జరిపి.. చివరకు అధికారులను విడిపించారు.ఈ సందర్భంగా పెద్దమందడి విద్యుత్ శాఖ ఏఈ శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని గతేడాది విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేసి 27 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పెండింగ్ విద్యుత్ బకాయిలు వసూలు చేసేందుకు నలుగురు లైన్మెన్లతో కలిసి తాను తండాకు వెళ్లినట్టు చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వస్తే మాట్లాడుకుందామని తమను తండావాసులు పిలిచి అనూహ్యంగా గదిలో బంధించి నాలుగు గంటల పాటు నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 మందికి మీటర్లు మంజూరు అయినప్పటికీ బిగించకుండా మినిమం బిల్లులు చెల్లిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పారు.