Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (73) కన్నుమూశారు. బొజ్జల గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. బొజ్జల శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు గ్రామంలో 1949, ఏప్రిల్ 15న బొజ్జల జన్మించారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. శ్రీకాళహస్తి నుంచి 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 1994, 1999, 2009, 2014లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాస్త్ర సాంకేతిక, రహదారులు, భవనాల శాఖతో సహా వివిధ శాఖలకు బొజ్జల మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి గెలుపొందిన బొజ్జల 2014-19 మధ్య కాలంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలిపిరి బాంబు పేలుడు ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా ఉన్నారు. బొజ్జలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆప్తులుగా ఉండేవారు. కీలక సమయాల్లో పార్టీలో బొజ్జల, తుమ్మల, మండవ క్రీయాశీలక పాత్ర పోషించారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో బొజ్జల-గాలి ముద్దు కృష్ణమనాయుడిది మంచి జోడిగా చెప్పుకునేవారు. 2004-2014 మధ్య టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొజ్జల - గాలి ముద్దుకృష్ణమ నాయుడును చిత్తూరు బ్రదర్స్ అంటూ పార్టీ నేతలు ఆత్మీయంగా పలకరించేవారు.
ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలోకి: చంద్రబాబు
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం అత్యంత బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. లాయర్‌గా జీవితం ప్రారంభించి ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరారని చెప్పారు. శ్రీకాళహస్తి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారన్నారు. బొజ్జల ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆత్మీయ మిత్రుడిని కోల్పోయా: సీఎం కేసీఆర్
బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో తనతో పాటు కలిసి పనిచేసిన రాజకీయ సహచరుడు, ఆత్మీయ మిత్రుడిని కోల్పోయానని సీఎం విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జలను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన జ్జాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. బొజ్జల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.