Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతన జీవోల విషయంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం
- పేదల కడుపు మాడ్చి.. బడాబాబుల బొజ్జ నిప్పేందుకు కుట్రలు
- కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమించాల్సిందే..
- అమరుల స్ఫూర్తితో ముందుకు కదలాలి : కాటేదాన్ పారిశ్రామిక వాడ
- 'మే డే' వారోత్సవాల ముగింపు సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఏ లెక్క ప్రకారం బీజేపీ ప్రభుత్వం కనీస వేతనాన్ని రూ.4,628 నిర్ణయించిందో చెప్పాలని, ఇదే వేతనంతో మోడీ జీవించగలరా? ఇక కార్మికులెలా బతుకుతరని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య ప్రశ్నించారు. పేద కార్మికుల కడుపు మాడ్చి బడా పెట్టుబడిదారుల బొజ్జ నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో వారం రోజులు పాటు సాగిన మేడే వారోత్సవాల ముగింపు సభకు వీరయ్య హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్రకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో వీరయ్య మాట్లాడారు.
కనీస వేతన చట్టం తెలియని అమాయక నాయకులు దేశాన్ని పాలిస్తున్నారంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించింద న్నారు. ఒక కుటుంబం కనీస జీవనం గడపడానికి అవసరమయ్యే వేతనం కనీస వేతనంగా చట్టం చెబుతుందని గుర్తు చేశారు. ప్రస్తుతం పెరిగిన ధరలను బట్టి చూస్తే ఒక కుటుంబం జీవించాలంటే రూ. 24 వేలు అవసరమని తెలిపారు. ఇలాంటి పరిస్థితిల్లో మోడీ ప్రభుత్వం ప్రస్తుతం కనీస వేతనం రూ. 4,628 చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కనీస వేతనంతో బీజేపీ నాయకులు బతుకగలరా.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం వేతన సవరణ జీవోలను అమలు చేయకుండా పెట్టుబడిదారులకు దాసోహం చేస్తుందన్నారు. ఐదేండ్లకు ఒకసారి వేతన సవరణ చేయాల్సిన ప్రభుత్వం ఏండ్లు గడిచినా దాని ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో 73 రంగాల్లో వేతన సవరణ చేయాల్సి ఉన్నప్పటికీ.. ఇటీవల 5 రంగాల్లో వేతన సవరణ చేసి జీవో తీసుకువచ్చిన ప్రభుత్వం కంపెనీల యాజమాన్యాలకు భయపడి జీవోను అమలు చేయకుండా మూలన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో కరోనా సమయంలో మోడీకి కుడి, ఎడమ భుజాలైన ఆదానీ, అంబానీల ఆదాయం రెట్టింపు కాగా, కార్మికులు మాత్రం తిండిలేక.. ఆకలి చావులతో చచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి నుంచి కార్మికులు ప్రశ్నించే గొంతులుగా ఎదగాలని పిలుపు నిచ్చారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కేరళలో కరోనా సమయంలో వలస కార్మికులకు అండగా నిల్చిందన్నారు. ప్రజారోగ్య విషయంలో కేరళ ప్రభుత్వం కృషిని గుర్తించి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని ఐక్యరాజ్య సమితి అహ్వానించి సత్కరించిందని గుర్తు చేశారు.
కార్మికులకు కనీస వేతనం అమలు చేస్తోందన్నారు. ఇలా కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తుందంటే.. అది ఎర్రజెండానేనని స్పష్టంచేశారు. భవిష్యత్‌లో కార్మికుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలకు సీఐటీయూ శ్రీకారం చుట్టనుందని, కార్మికులంతా ఐక్యంగా ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సభలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కవిత, నాయకులు మల్లేశ్, కుర్మయ్య, రవి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.