Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ సంఘం స్టడీసర్కిల్‌ను సబ్ కమిటీ కన్వీనర్ బి నరసింహారావు అధ్యక్షతన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు జరుపబోతున్న 'మనఊరు-మన బడి, మనబస్తీ' కార్యక్రమం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. అందుకనుగుణంగా ఉపాధ్యాయ నియామకాలు జరపాలని కోరారు. దాని కంటే ముందు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల విద్యాశాఖ మంత్రితో జరిగిన చర్చల్లో వేసవి సెలవుల్లోనే పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీలు అమలు కాకపోతే దశల వారీ పోరాటాలను నిర్వహిస్తామనీ, అందుకు ఉపాధ్యాయులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శిక్షణా కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపైన అవగాహన పెంచుకోవాలనీ, అందుకు విస్తృత అధ్యయనం చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు కేవలం వారు బోధించే సబ్జెక్టుకే పరిమితం కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపైన సమగ్ర అవగాహన పెంచుకుంటేనే వాటిని సమయానుకూలంగా పరిస్థితులకు అన్వయిస్తూ బోధన చేయొచ్చని తెలిపారు. సమగ్ర అధ్యయనం వల్లే బోధించే అంశంపై సాధికారతతో ఆకట్టుకునేలా బోధన చేయొచ్చని వివరించారు. ప్రస్తుత సాంకేతికతను వివిధ మాధ్యమాల ద్వారా ఉపయోగించడంలో నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి,రాష్ట్ర కార్యదర్శులు బి రాజశేఖర్‌రెడ్డి,ఎస్ రవిప్రసాద్గౌడు, గోల్కొండ శ్రీధర్,జి నాగమణి,ఆర్ శారద,కె రవికుమార్‌తోపాటు అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రకమిటీ సభ్యులు పాల్గొన్నారు.