Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కువ ధరల కొత్త ఔషధాలకే మొగ్గు
- మెడికల్ షాపుల మాయాజాలం
- సామాన్యునిపై పడుతున్న భారం
- చోద్యం చూస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సామాన్యుడి బతుకు దినదినగండంగా మారుతున్నది. పెరిగిన ధరలతో ఇప్పటికే విలవిలలాడుతున్న ప్రజలను మందుల పేరుతోనూ మెడికల్ మాఫియా దోపిడీకి గురి చేస్తున్నది. ఒకవైపు జనరిక్ మందులనే రాయాలనే ప్రభుత్వ నిబంధనలున్నా వాటి అమలు, పర్యవేక్షణ అంతంత మాత్రమే. ఎక్కడైనా జనరిక్ మందులు రాసినా అందులోనూ తక్కువ ధరకు వచ్చే మందులు లేవంటూ మెడికల్ షాపుల్లో సమాధానం. రోగాల బారిన పడినవారు అందుబాటులో ఉన్న మందులను ఎంత ధరకైనా కొనాల్సిన అవసరాన్ని షాపుల యజమానులు తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. మందుల ఉత్పత్తి, సరఫరా, నిల్వపై పారదర్శకమైన సమాచారం లేకపోవడంతో మెడికల్ షాపుల యజమానుల అబద్ధాలను సామాన్యులు నిలదీయలేని పరిస్థితి.
ఇటీవల కొన్ని మందుల ధరలను పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ మందులకు సంబంధించి ఉన్న పాత స్టాక్‌ను పాత ఎంఆర్పీ ధరలకే అమ్మాల్సి ఉంటుంది. ఇక్కడే మెడికల్ షాపుల యజమానులు దోపిడికి తెరలేపారు. పాత స్టాక్ ఉన్నప్పటికీ లేదంటూ సమాధానమిస్తున్నారు. అయితే గతంలో మెడికల్ షాపులు నిరుద్యోగులకు స్వయం ఉపాధిగా ఉన్న సమయంలో ఒక చోట దొరకకపోయినా మరో చోట లభిస్తాయన్న భరోసా ఉండేది. కానీ ఔషధాల అమ్మకాల రంగంలోకి కార్పొరేట్ వర్గాలు రంగప్రవేశం చేసిన ప్రస్తుత తరుణంలో ఈ దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఈ కార్పొరేట్ మెడికల్ షాపులు వందలు, వేల సంఖ్యలో విస్తరించి ఉండటంతో ఒకేసారి అన్ని షాపుల నుంచి పాత స్టాక్‌ను లేకుండా చేయడం, వెనక్కి పంపడం లాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు సమాచారం.
ఉదాహరణకు అమ్లోపిన్ 25 ఔషధానికి సంబంధించిన ధరలు పెరిగాయి. అయితే ఈ మందులకు సంబంధించి మెడికల్ షాపుల్లో పాత స్టాక్ మిగిలే ఉన్నది. దానికి సంబంధించి పాత ధరలనే తీసుకోవాల్సి ఉంటుంది. 10 టాబ్లెట్ల స్ట్రిప్‌కు పాత ధర రూ.85, కొత్త ధర రూ.95గా ఉన్నది. నాలుగు కొనుగోలు చేస్తే రెండు పాత స్టాక్ లోనివి. మరో రెండు స్ట్రిప్స్ కొత్త స్టాక్లోవి ఇస్తూ పెరిగిన ధరలనే తీసుకుంటున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నప్పటికీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు చోద్యం చూస్తున్నారే తప్ప కట్టడి చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. అడపాదడపా జరిగే దాడులే తప్ప పటిష్టమైన చర్యలు తీసుకుంటే తప్ప కార్పొరేట్ మోసాల నుంచి ప్రజలను కాపాడలేరని పలువురు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.