Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల జోలికొస్తే ఊరుకునేది లేదు
- 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి : సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు
- ఖమ్మంలో 180 మీటర్ల భారీ ఎర్రజెండాతో ర్యాలీ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కార్పొరేట్ల తొత్తు ప్రధాని నరేంద్రమోడీ అని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తే సహించేది లేదన్నారు. మేడే వారోత్సవాల్లో భాగంగా సీఐటీయూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 180 మీటర్ల ఎర్రజెండాతో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా షాప్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో స్థానిక కమాన్బజార్లో ఏర్పాటు చేసిన సభలో సాయిబాబు మాట్లాడారు. 8 గంటల పనివిధానాన్ని ఎత్తివేసి, కార్మిక హక్కులను హరించాలని చూస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) స్ఫూర్తి కొనసాగించాలన్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలో కొనసాగుతున్న నయా ఉదారవాద విధానాల దాడి నుంచి కార్మికవర్గాన్నే కాకుండా మొత్తం ప్రజానీకాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఆకాశాన్నంటుతున్న ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతలు, ఆకలి, దారిద్య్రం, పీడన, నిరంకుశత్వం నుంచి విముక్తి కల్పించే ప్రత్యామ్నాయ విధానాల కోసం మరింత ఐక్యత, పట్టుదలతో సుదీర్ఘపోరాటాలకు కార్మికవర్గాన్ని సంసిద్ధం చేయాల్సిన బాధ్యత వామపక్ష, ప్రజాతంత్ర శక్తులపై ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు మతోన్మాద చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పనివిధానం రక్షణకు మరో పోరాటం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ విష్ణువర్దన్, కల్యాణం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు యర్రా శ్రీకాంత్, పిన్నింటి రమ్య, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అఫ్రోజ్సమీనా, గుమస్తాల సంఘం అధ్యక్షులు బండారు యాకయ్య, సీఐటీయూ నాయకులు దొంగల తిరుపతిరావు, అమరావతి, మురహరి తదితరులు పాల్గొన్నారు.