Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డూఅదుపు లేకుండా ఫీజు వసూలు
- గ్రూప్-1, పోలీసు, టెట్ నోటిఫికేషన్లు విడుదల
- ఇదే అదనుగా 'క్యాష్'చేసుకుంటున్న వైనం
- నిరుద్యోగులపై పెనుభారొం నియంత్రణను గాలికొదిలిన టీఆర్ఎస్ సర్కారు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దువాలి అన్నట్టుగా కోచింగ్ కేంద్రాలు నోటిఫికేషన్లు వచ్చినపుడే యధేచ్చగా వ్యాపారం చేస్తున్నాయి. వాటి దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిరుద్యోగులను అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్-1, పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ వచ్చింది. అదే అదనుగా 'క్యాష్' చేసుకోవాలని కోచింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా ఫీజులు గుంజుతున్నాయి. గ్రూప్-1కు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు, గ్రూప్-2కు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు, పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐకి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు, టెట్‌కు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, టెట్, టీఆర్టీకి కలిపి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాల్లోనూ కోచింగ్ కేంద్రాలున్నాయి. ఈ ఫీజులతో నిరుద్యోగ యువకులు బెంబేలెత్తుతున్నారు. వాటిని కట్టలేక సతమతమవుతున్నారు. ఇంకోవైపు కోచింగ్ ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాలు వంటివాటితో నిరుద్యోగులపై పెనుభారం పడుతున్నది. ఇప్పటికే కోచింగ్ తీసుకున్న వారు స్టడీ హాల్‌కు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు చెల్లించాల్సి వస్తున్నది. ఈ అవకాశం మళ్లీ రాదేమోనన్న భావనతో నిరుద్యోగులు ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న పట్టుదలతో ఖర్చుకు వెనుకాడడం లేదు. ఈ బలహీనతను కోచింగ్ కేంద్రాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. వాటి నియంత్రణను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియంత్రణ కోసం కమిటీ వేస్తామంటూ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించినా ఇంత వరకూ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వసతులు అంతంతే...
రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో అపార్ట్మెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, ఇతర ఇరుకు గదుల్లో కోచింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. వాటిలోనే వేలాది మంది నిరుద్యోగులకు కోచింగ్ ఇస్తున్నారు. కానీ వాటిలో వసతులు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అంటే సరిపోయినన్ని టారులెట్లు, మరుగుదొడ్లు, తాగునీరు, వెలుతురు సక్రమంగా ఉండేలా తరగతి గదులు వంటి మౌలిక వసతులను సమకూర్చడం లేదు. ఇంకోవైపు ఇబ్బడిముబ్బడిగా కోచింగ్ కేంద్రాలు ప్రారంభిస్తుండడంతో వాటిలో అర్హులైన వారు బోధిస్తున్నారా? లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కనీస వసతులు కల్పించకుండా ఎక్కువ మంది నిరుద్యోగులను చేర్చుకోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. కోచింగ్ కేంద్రాల యాజమాన్యాలు మాత్రం వసతుల కల్పనపై కాకుండా కేవలం ఫీజులపైనే దృష్టిసారించడం గమనార్హం. ఇంకోవైపు కోచింగ్ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ ఉన్నదా?, నిబంధనల ప్రకారమే నడుస్తున్నాయా?అన్నది సైతం అనుమానమే. 1997, ఆగస్టు 6న జారీ చేసిన జీవో నెంబర్ 200 ప్రకారం కోచింగ్ సెంటర్లు, ట్యుటోరియల్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఎంసెట్, ఐఐటీ, మెడికల్, పీజీ, ఎడ్‌సెట్, బ్యాంకింగ్, సివిల్స్, గ్రూప్స్, ఐటీతోపాటు ట్యుటోరియళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఎడ్యుకేషన్ యాక్ట్-1982లోని సెక్షన్ 32 ఆధారంగా జీవో నెంబర్ 200 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ గతంలోనే ఆదేశించింది. రూ.1000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించాలనీ, రూ.10 వేలు డిపాజిట్ చేయాలని కోరింది. కోచింగ్ కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతున్నది.
ప్రత్యామ్నాయాలపై అభ్యర్థుల దృష్టి
వేలాది రూపాయలు ఫీజు చెల్లించి కోచింగ్ తీసుకునే ఆర్థిక స్తోమత లేని నిరుద్యోగులు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. దీనికి ఫీజు తక్కువ, సమయం కలిసొస్తుంది. ప్రయాణించే అవకాశముండదు. ఆన్లైన్ కోచింగ్‌కు డబ్బులు కట్టలేని వారు స్టడీ మెటీరియల్‌తో సర్దుకుంటున్నారు. సొంతంగానే పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. స్టడీ హాళ్లలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు. గ్రూప్స్, పోలీసు, టెట్ వంటి కోచింగ్‌ను టీశాట్, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఇస్తున్నాయి. వాటికి అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇంకోవైపు పోలీసు కానిస్టేబుల్ కోచింగ్‌ను చాలా మంది ఎమ్మెల్యేలు సైతం తమ సొంత ఖర్చుతో ఇప్పిస్తుండడం గమనార్హం. వీలైనంత మంది ఈ కోచింగ్‌లకు వినియోగించుకుంటున్నారు.
టీఆర్టీ కోచింగ్‌పై ప్రభుత్వం దృష్టిసారించాలి :
రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు
ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్ కోచింగ్ పట్ల ఎక్కువ మంది అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ఇంకోవైపు ఇంతకుముందే టెట్ కోచింగ్ ఎక్కువ తీసుకోవడంతోపాటు అర్హత సాధించారు. పోలీసు కానిస్టేబుల్ కోచింగ్‌ను ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ఇప్పిస్తున్నారు. టీఆర్టీ కోచింగ్‌పైనా ప్రభుత్వంతోపాటు ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా దృష్టిసారించాలి. టీశాట్ కోచింగ్‌లో మార్పు చేయాలి. ప్రయివేటు ఆన్లైన్ కోచింగ్ సంస్థలు బోర్డును వినియోగించి అభ్యర్థులకు అర్థమయ్యేలా వివరిస్తున్నాయి. టీశాట్‌లో చర్చావేదికలా ఉండడం వల్ల అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. తరగతిలో బోధించినట్టు ఉంటే ఎక్కు మంది అభ్యర్థులకు బాగుంటుంది.
కోచింగ్ కేంద్రాలను ప్రభుత్వం నియంత్రించాలి :కోట రమేష్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు
రాష్ట్రంలోని కోచింగ్ కేంద్రాలను ప్రభుత్వం నియంత్రించాలి. అందుకోసం ప్రత్యేకంగా యంత్రాంగాన్ని నియమించాలి. యధేచ్చగా ఫీజుల దోపిడీ సాగుతున్నది. పెద్దఎత్తున కోచింగ్ కేంద్రాల వ్యాపారం సాగుతున్నది. పేద, మధ్యతరగతి అభ్యర్థులకు ఆర్థికంగా తీవ్రనష్టం. అయితే పాలకులకు ముడుపులు అందుతున్నాయనే విమర్శలున్నాయి. అందుకే అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజులను అరికట్టాలి. కోచింగ్ కేంద్రాలన్నీ నిబంధనల ప్రకారం నడిచేలా చర్యలు తీసుకోవాలి.