Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 గంటల పని విధానం దుర్మార్గం
- కార్మికవర్గ ఐక్యతను చీలుస్తున్న మోడీ ప్రభుత్వం
- కార్మిక కోడ్లతో యథేచ్ఛగా శ్రమ దోపిడీకి అవకాశం
- కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమించాల్సిందే.. : 'మే డే' వారోత్సవాల ముగింపు సభల్లో నేతల పిలుపు
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
సమస్త శ్రామికుల పండుగ మేడే తప్ప మరోటి కాదు.. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని తొలగించి.. 12 గంటల పని విధానం తేవడం దుర్మార్గం.. కార్మిక చట్టాలను తొలగించి నాలుగు కార్మిక కోడ్లను తెచ్చి కార్మికుల శ్రమను యాజమాన్యాలు యథేచ్ఛగా దోచుకునేందుకు మోడీ ప్రభుత్వం అవకామిస్తోంది.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేయాలి'' అని మేడే వారోత్సవాల ముగింపు సభల్లో నేతలు ఉద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పెద్దఎత్తున మేడే వారోత్సవ ర్యాలీలు నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా గణేష్‌నగర్‌లో నిర్వహించిన సభలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్ పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టరేట్, న్యూ బస్టాండ్ నుంచి అమరవీరుల స్థూపం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో వారు మాట్లాడారు. 12 గంటల పని విధానం అమలు కార్మికులకు తీవ్ర నష్టదాయకమన్నారు. నిత్యం కష్టం చేస్తే 50 యేండ్లకే జీవితకాలం ముగుస్తుందని తెలిపారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తూ కార్మికుల పొట్టగొట్టడం సిగ్గుచేటన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులపై దాడిచేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పిడికిలి బిగించాలని, పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
వారం రోజులుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగిన మే డే వారోత్సవ కార్యక్రమాల ముగింపు వేడుకలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం విశాల ఐక్యవేదికతో పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే అనేది భారతీయ సంస్కృతి కాదని.. ఇక్కడ విదేశీ సంస్కృతిని పాటించకూడదని మోడీ అనడం సిగ్గు చేటన్నారు. మే డేను వక్రీకరించడం అంటే కార్మిక వర్గాన్ని మోసం చేయడం తప్ప మరోటి కాదన్నారు. కార్మిక చట్టాల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జహీరాబాద్‌లో బైక్ ర్యాలీ, అనంతరం గంజ్‌లో సభ జరిగింది.
మే డే వారోత్సవాల ముగింపు సభను హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని సీఐఏహాల్లో నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ హాజరయ్యారు. కార్మికుల హక్కులు.. పనిగంటలు.. కార్మిక కోడ్ల వివరించారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి.
కార్మిక కోడ్లపై సమరశీల పోరాటాలు
సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
29 కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక కోడ్లను వ్యతిరేకిస్తూ సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో అధ్యక్షులు యంవి.అప్పారావు అధ్యక్షతన మే డే వారోత్సవాల ముగింపు సభ జరిగింది. ఎం.సాయిబాబు జెండావిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నాలుగు కార్మిక కోడ్లను జూన్ నుంచి అమలు చేసే ప్రమాదం ఉందని చెప్పారు.
కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్
మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద మేడే ముగింపు సభ నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని నెహ్రుగంజి హమాలీ ఆఫీస్ వద్ద నిర్వహించిన మేడే ముగింపు సభలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దేశ సంపద అందరికీ చెందాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్
దేశ సంపద కొంతమంది చేతిలోనే ఉందని.. అది అందరికీ చెందాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్ అన్నారు. మే డే వారోత్సవాల ముగింపు సందర్భంగా నర్సాపూర్‌లో సభ, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు ప్రజలు, కార్మికులు బెంబేలెత్తుతుంటే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జాతీయ సంపదను పూర్తిగా అంబానీ, అదానీలకు కట్టబెట్టే పనిలో ఉందని విమర్శించారు.
కనీస వేతనం రూ. 24 వేలు ఇవ్వాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ
కార్మికులకు కనీస వేతనం రూ.24 వేలు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ ఐద్వా హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నాగలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధురానగర్‌లోని స్టేట్ హోమ్లోగల శిశువిహార్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళా కార్మికులకు ఆటలపోటీలు నిర్వహించారు. ముషీరాబాద్ జోన్ పరిధిలో అంబేద్కర్‌నగర్, భరత్‌నగర్ బస్తీల్లోనూ క్రీడలు నిర్వహించారు. విజేతలకు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ బహుమతులు ప్రదానం చేశారు.