Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృత్తిలో అడుగడుగా జీవన్మరణమే
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ డిమాండ్
- శక్తి మేరకు ఆదుకుంటున్న తాడీ కార్పొరేషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గీత కార్మికుల ప్రాణానికి భరోసా లేదు. తాటి చెట్టు ఎక్కేందుకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తారో రారోనన్న ఉత్కంఠ.. చెట్టు ఎక్కడమంటేనే ఎన్నో సవాళ్లుతో కూడుకున్న పని. ఎంతో చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది.దీంతో ప్రమాదాల బారిన పడి వైకల్యంతో బాధపడుతున్నవారు వేల మందే ఉంటున్నారు. ఈ ఏడాది ఐదు నెల్ల కాలంలోనే 39మంది చనిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంటి పెద్ద దిక్కు చనిపోవటంతో కుటుంబం రోడ్డున పడ్డట్టైయిందని వారు వాపోతున్నారు. పథకాలెన్నిన్నా..వారి ధరికి చేరకపోవటంతో వేదనా భరిత జీవితాలను అనుభవిస్తున్నారు. రోజురోజుకు బతుకులు దుర్భరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాడీ కార్పొరేషన్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం, ఆ తర్వాత దహన సంస్కారాల కోసం రూ. 25వేల ఆర్థిక సమాయం అందించి తక్షణ ఉపశమనం కలిగిస్తున్నారు. ఈ రకంగా ఈ కాలంలో చనిపోయిన వారికి గీత పారీశ్రామిక ఆర్థిక సహాకార సంస్థ(టాడీ కార్పొరేషన్) రూ.9,75,000లను అందజేసింది. ఆరోగ్య సహాయం కోసం 122 మందికి మరో రూ.18,30,000అందించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
వృత్తే ఆధారం..
రాష్ట్రంలో గీత వృత్తిపై ఎక్కువ కుటుంబాలు ఆధార పడి బతుకుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల జనాభా సంఖ్య 15.76లక్షలు. కుటుంబాల సంఖ్య 4,66,667. సుమారు 75 లక్షల మందికిపైగా పరోక్షంగా, ప్రత్యక్షంగా జీవనం సాగిస్తున్నారు. 4,366 సొసైటీలు,3,709 టీపీటీల ద్వారా 2,18,107మంది సభ్యత్వం కలిగి వత్తి చేస్తున్నారని అధికారుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ఏటా వేసవి సీజన్ ప్రారంభం నుంచి జూన్ నెల ఆఖరి వరకు తాటి కల్లు లభిస్తుంది. ఉదయం లేచింది మొదలు ఎండను సైతం లెక్కచేయకుండా రోజుకు మూడు సార్లు చెట్టును ఎక్కుతారు. రెక్కలు ముక్కలు చేసుకుని శారీరక బాధల్ని అనుభవిస్తూ కష్టపడతారు. ఈ కాలంలో వచ్చిన ఆదాయం తోనే వారి కుటుంబాలు ఏడాది పొడుగునా జీవనం సాగిస్తాయి. చేసిన కష్టానికి ప్రతిఫలం రాక మార్కెట్లో డిమాండ్ లేక తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు.
ప్రత్యామ్నాయం కావాలి..
రాష్ట్రంలోని గౌడ కులస్తులు తరతరాలుగా గీత వృత్తినే నమ్ముకుని బతుకుతున్నారు. ఆధునిక కాలంలో కూడా ఎత్తైన తాటి చెట్టును ఎక్కాలంటే మోకు, ముస్తాదుపైనే ఆధారపడాల్సి వస్తున్నది. దీంతో ఎక్కువ మంది దీనికి దూరమవుతున్న స్థితి కూడా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వృత్తి నిర్వహణకోసం నైపుణ్యతతో కూడిన ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాల్సిన అవసరం ఉందని వృత్తిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఏ వృత్తికి లేని ప్రమాద సమస్యలు గీత వృత్తికి ఉండటంతో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందనే చర్చ సాగుతున్నది.
రుణాలిచ్చి ఆదుకోవాలి
మారుతున్న కాలంతో పాటు పయనించాలన్న తపనతో యువత సాంప్రదాయంగా వస్తున్న వృత్తి పట్ల ఆసక్తి చూపటం లేదు. మరో పక్క చదువుకు తగ్గఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరకటం లేదు. దీంతో ఆయా కుటుంబాలకు చెందిన యువత నిర్వీర్యమై తప్పుదారిపడుతున్న ఘటనలు అక్కడక్కడ సాక్ష్యాత్కరిస్తున్నాయి. మరి కొంతమంది బాధ్యత మరిచి వ్యవహరించటంతో కుటుంబానికే ఇబ్బందిగా మారుతున్నారన్నారని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో యువతకు కార్పొరేషన్‌ద్వారా స్వయం ఉపాధికోసం రుణాలు అందించాలని కార్మికులు కోరుతున్నారు. అందుకు తగిన బడ్జెట్ కేటాయించి ట్యాడీ కార్పొరేషన్‌కు తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని యువత అభిప్రాయపడుతున్నారు.
ఆదుకుంటున్న కార్పొరేషన్
కల్లు గీత కార్పొరేషన్ వృత్తిదారులకు ఆలంబనగా నిలుస్తున్నది. చెట్టుపైనుంచి పడ్డవారిని మానవత్వంతో ఆదుకుంటోంది. దీంతో బాధిత కుటుంబాల్లో కార్పొరేషన్ కార్యకలాపాల పట్ల భరోసా ఏర్పడుతున్నది. తాటిచెట్టు ఎక్కే క్రమంలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ ఏడాది ఐదు నెల్ల కాలంలోనే పెద్దమొత్తంలో గీత కార్మికులు ప్రమాదాలకు గురయ్యారు. కొందరు చనిపోగా, మరికొందరు క్షతగాత్రులుగా చికిత్స పొందుతున్నారు. ఒక్కో సంఘటన ఒక్కో రకం. అన్నీ హృదయవిధారకరమైనవే. కుటుంబానికి పెద్దదిక్కైన ఆ వృత్తిదారుడు తమ నిండు ప్రాణాలను ఒదలటంతో కుటుంబ జీవనం ఆస్తవ్యస్తంగా తయారువుతున్నది. దిక్కులేని జీవచ్ఛవాలుగా మారిన ఆ కన్నీటి ముంతలకు ఆలంబనగా కార్పొరేషన్ నిలవటం..కాస్త ఆ కుటుంబాలకు ఉపశమనమే..
తక్షణ సహాయం అవసరమే..
కార్పొరేషన్‌ద్వారా ప్రమాద బారిన పడ్డ వృత్తిదారులకు తక్షణం సహాయం అందిస్తున్నారు. దీంతో గీత కార్మికులు కొంత ఉపశమనం పొందుతున్నారు. తాము చేస్తున్న వృత్తి ప్రమాదమని తెలిసినా అదే చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతున్నాయి. ఇతర అవసరాలు తీరటం లేదు. ఇలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. జీవితాలను నిలబెట్టాలి. ఇదే సమయంలో..కార్పొరేషన్‌ను కూడా బలోపేతం చేయాలి. తగిన బడ్జెట్‌ను కేటాయించాలి.
-ఎంవీ రమణ
వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్