Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ విద్యార్థులకు శనివారం సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 నిర్వహించామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,37,865 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, శనివారం జరిగిన పరీక్షకు 4,16,964 (95.3 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 20,901 (4.7 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, హైదరాబాద్‌లో ఒకరిని మాల్‌ప్రాక్టీస్ కేసుల కింద బుక్ చేశామని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు తరఫున పరిశీలకులు మహబూబ్‌నగర్, మెదక్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిశీలించారని వివరించారు. సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 తెలుగు ప్రశ్నాపత్రంలో రెండు తప్పులు దొర్లాయి. ప్రత్యేకత అనే పదానికి బదులుగా ప్రత్యేక అని వచ్చింది. మరో ప్రశ్నలో చినుకులు అనే పదానికి బదులుగా చినుకుల అని ప్రచురితమైంది. ఉర్దూ ప్రశ్నాపత్రంలో గుల్డాన్ అని రావాల్సి ఉండగా, గుల్డన్ అని వచ్చింది. వీటిని తర్వాత నిపుణులు పరిశీలించి సరిచేశారు. జనగామ జిల్లా ఘన్‌పూర్‌లో ఒక విద్యార్థికి సంస్కృతం ప్రశ్నాపత్రానికి బదులుగా హిందీ ప్రశ్నాపత్రం ఇన్విజిలేటర్ ఇచ్చినట్టు తెలిసింది. పరీక్ష రాసిన తర్వాత తండ్రికి ఆ విషయం చెప్పి బోరున విలపించినట్టు సమాచారం. దీనిపై ఇంటర్ బోర్డు అధికారులను సంప్రదించగా అలాంటి ఘటన తమ దృష్టికి రాలేదని వివరణ ఇచ్చారు. అ జిల్లా అధికారులను సంప్రదించి వివరాలను కనుక్కుంటామనీ, ఏదైనా లోపముంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.