Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సంస్థల బలోపేతం రాజీవ్ చలవ వల్లే : కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు వచ్చిన పంచాయతీ రాజ్ చట్టాన్ని అమలు చేయకుంటే కోర్టులను ఆశ్రయించాలని కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ సూచించారు. ఎస్.జైపాల్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో ప్రజాస్వామ్యం - వికేంద్రీకరణ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నిధులివ్వకుండా కేవలం అధికారాలు అప్పగించామని చెప్పడం వల్ల ఉపయోగముండబోదని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల బలోపేతానికి పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చారని గుర్తుచేశారు. ఈ చట్టం తేవడానికి ముందు దేశవ్యాప్తంగా ఆయన పర్యటించి పలువురి అభిప్రాయాలను స్వీకరించారని తెలిపారు. కమ్యూనిస్టు పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్, తెలుగుదేశం పార్టీ పాలనలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మంచి విషయాలుంటే వాటిని దేశవ్యాప్తం చేసేందుకు రాజీవ్ ముందుకొచ్చారని చెప్పారు. ఈ చట్టం రావడంతో ఎస్సీలతో పాటు పేద వర్గాల నుంచి ప్రజా ప్రతినిధులు ఆవిర్భవించారని తెలిపారు. అందుబాటులో ఉండే నాయకత్వం ఎక్కువగా నిమ్నవర్గాలే కావడంతో ఆ వర్గాల నుంచి ఎక్కువ మంది ఎన్నికవుతూ వచ్చారని తెలిపారు. ప్రస్తుతం 15 రాష్ట్రాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారనీ, ఇది అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనాభాలో సగభాగమున్న మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుందని కితాబిచ్చారు. ఈ చట్టం రావటానికి ముందు దేశంలో 5,000 మంది మాత్రమే ప్రజా ప్రతినిధులుంటే, ఆ తర్వాత 2,50,000కు పెరిగిందన్నా రు. మహిళా సర్పంచ్ లకు భర్తలు సహకరించడంలో తప్పులేదని కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని వివరించా రు. తన ఎదుగుదలకు లేదా పడిపోవడంలోనూ తన సతీమణి భాగస్వామ్యం ఉందని మణిశంకర్ అయ్యర్ అన్నారు. ఇది అర్థం చేసుకోకుండా సర్పంచ్ భర్త జోక్యం అంటూ యాగీ చేయడం తగదని అభిప్రాయపడ్డారు. చట్టంలో తప్పనిసరి అంశాలనే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయనీ, సిఫారసు చేసిన వాటిని పట్టించుకోవడం లేదని తెలిపారు. 29అంశాలు పూర్తిగా అమలయ్యేలా పౌరసమాజం, స్వచ్చంద సంస్థలు,న్యాయవాదులు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ల అధికారాలను ప్రభుత్వ ఉద్యోగులకు కట్టబెట్టడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమ ంలో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ సలహాదారు మోహ న్ గురుస్వామి, ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ కె.పురు షోత్తం రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.