Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోదాడ - ఖమ్మం రహదారిపై రైతుల రాస్తారోకో
నవతెలంగాణ-ముదిగొండ
దొడ్డురకం ధాన్యం (1010) కాంటాలో నాలుగు కేజీల వరకు తరుగు కింద తీయడాన్ని నిరసిస్తూ రైతులు శనివారం కోదాడ - ఖమ్మం ప్రధాన రహదారిపై వడ్లు బస్తాలు వేసి బైటాయించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి కొనుగోలు కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు పయ్యావుల పుల్లయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని చెబితే.. కేంద్రాల్లో మాత్రం వడ్లు సన్నాలు, లావులంటూ నిర్వాహకులు రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లావు వడ్లు కొనుగోలు చేస్తే నాలుగు కేజీలు అదనంగా తరుగు పేరుతో కోత పెడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. మద్దతు ధరకు 1010 రకం వడ్లు కొనుగోలు చేసి తరుగు శాతం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు గుగులోతు సంధ్య, గుంజలూరి వెంకటలక్ష్మి, ఎస్కే సొందు, ధనియాకుల చిన్నవీరస్వామి, కృష్ణ సాగరపు సత్యం, తోర్తి నాగయ్య పాల్గొన్నారు.