Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి ఆలయ ప్రతిష్టను దెబ్బతీయొద్దు
- చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపెట్టొద్దు : అకాల వర్షంతోనే రోడ్లు దెబ్బతిన్నాయి : దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ-యాదాద్రి
యాదగిరిగుట్టలో నిర్మాణాలపై రాజకీయ లబ్ది కోసమే విమర్శలు చేస్తున్నారని, అకాల వర్షం వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని.. వెంటనే పునరుద్ధరించారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో సౌకర్యాల కల్పన, ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
క్యూ కాంప్లెక్స్‌లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటం, వాష్ రూమ్స్‌లో పరిశుభ్రత, కొండపైన చలువ పందిళ్ల ఏర్పాటు, మురుగునీటి కాల్వల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. వృద్ధులు, వికలాంగులకు వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొండ కింద మొబైల్ టారులెట్స్ ఏర్పాటు, చేయాలన్నారు. అకాల వర్షం వల్ల ఉత్పన్నమైన సమస్యలు, పునరుద్ధరణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. కూలిన పందిళ్లు, వాననీటి లీకేజీలు, ఇతర నష్టాలపై ఆరా తీశారు. ఇలాంటి సమస్యలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా వర్షకాలంలోగా వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించారు. ప్రధాన ఆలయంతో పాటు మిగతా నిర్మాణాలు నూతనంగా చేపట్టినందువల్ల కొన్ని రోజులపాటు నిర్వహణలో పురోగతి చూపిస్తూ మందుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. దీన్ని పెద్ద తప్పిదంగానో లేదా పొరపాట్లుగా చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. యాదగిరిగుట్టపై నిర్మాణ లోపం లేదని, పనుల్లో నాసిరకం లేదని మంత్రి చెప్పారు. ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ గుట్ట ఆలయ పునర్నిర్మించారని తెలిపారు. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, పవిత్రమైన ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. 7.9 మిల్లీమీట్లర్ల అకాల భారీ వర్షం కారణంగా నిర్మాణంలో రోడ్లు దెబ్బతిన్నాయని, ఆలయ ప్రాంగణంలో పెండింగ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పైప్‌లైన్‌లో మట్టి, ఇసుక కూరుకుపోయి నీరు నిలిచిపోయిందే తప్ప నిర్మాణ లోపం కాదన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ చైర్మెన్ కిషన్‌రావు, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈ వసంత్ కుమార్, ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.