Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగరాజు కుటుంబానికి న్యాయం చేస్తాం : జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మెన్ విజరు సాంప్లా
- కలెక్టర్‌తో కలిసి బాధిత కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ- వికారాబాద్ ప్రతినిధి, మర్పల్లి
దళిత యువకుడు నాగరాజు హత్యకు కారకులైన నిందితులను ఎస్సీ యాక్ట్ ప్రకారం కఠినంగా శిక్షిస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మెన్ విజరు సాంప్లా స్పష్టం చేశారు. ఈనెల 4న హైదరాబాద్‌లో హత్యకు గురైన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలానికి చెందిన నాగరాజు కుటుంబాన్ని శనివారం కలెక్టర్ నిఖిలతో కలిసి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మెన్ విజరు సాంప్లా పరామర్శించారు. ఘటనకు గల కారణాలను బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయినందున, ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూం ఇల్లు, మూడెకరాల వ్యవసాయ భూమితో పాటు రూ.8.25 లక్షల ఆర్థిక సహాయాన్ని రెండు విడతల్లో అందించేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో సమావేశమవుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేసినట్టు, మరో ముగ్గురు పరారీరలో ఉన్నట్టు తెలిపారు. వారి వెంట జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి మల్లేశం, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూమోజెస్, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు రాములు తదితరులు ఉన్నారు.
నాగరాజు కుటుంబానికి మందకృష్ణ పరామర్శ
నాగరాజు కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని ఆయన కోరారు.