Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు దుప్పిలను చంపిన దుండగులు
- వేటగాళ్లను పట్టుకున్న పోలీసులు
- ఆరుగురు నిందితుల అరెస్ట్: వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-లింగంపేట్
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని కోమటిపల్లి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున అడవితల్లి ఒడిలో తుపాకుల మోత మోగింది. ఆరుగురు వేటగాళ్లు ఇద్దరు స్థానికుల సాయంతో రెండు దుప్పిలను చంపి తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి లింగంపేట్‌లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ హమీద్, మహమ్మద్ ఖాన్, ముస్తఫా అలీ, గులాం హుస్సేన్, సయ్యద్, అబ్దుల్ మీర్ అలీ రెండు కార్లలో అర్ధరాత్రి వేళ కోమటిపల్లి అటవీ ప్రాంతానికి వచ్చారు. ఒంటరిపల్లి తండాకు చెందిన రమావత్ పాండు, బాదియా సహకారంతో వన్యప్రాణులు సంచరించే ప్రదేశానికి వెళ్లారు. తెల్లవారుజామున దప్పిక తీర్చుకోడానికి వస్తాయని కాపుకాసి ఎయిర్ గన్స్‌తో రెండు చుక్కల దుప్పిలను కాల్చారు. వాటిని కత్తులతో రెండు ముక్కలుగా కోసి కారు డిక్కీలో వేసుకున్నారు.
తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో కానిస్టేబుల్ శంకర్, రామ్మోహన్, హోంగార్డులు వసంతరావు, అర్జున్ పెట్రోలింగ్ నిమిత్తం పోల్కంపేట్ వెళ్లి తిరిగి వస్తున్నారు. కోమటిపల్లి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా రెండు కార్లు కనిపించడంతో వెంటనే లింగంపేట్ ఎస్ఐ శంకర్, ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. వారు వెంటనే పోలీసులు సిబ్బందితో కలిసి పోల్కంపేట్ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. సైరన్ వేస్తూ నిందితుల కార్లను వెంబడించారు. ఐలాపూర్ గ్రామ సమీపంలో గల రైస్ మిల్ వద్ద ఒక కారును రోడ్డు పక్కన వదిలేసి నిందితులు పారిపోయారు. కారు డిక్కీలో ముక్కలుగా కోసిన 2 చుక్కల దుప్పిల కళేబరాలు ఉన్నాయి. చుట్టుపక్కల వెతకగా.. చేతిలో రైఫిల్ పట్టుకుని ఒక వ్యక్తి కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. అతని నుంచి హెయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఐదుగురు షిఫ్ట్కార్లో పారిపోయారు. దీంతో జిల్లా అంతటా అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి పోలీసులు గాలించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి జిల్లా పోలీస్ కంట్రోల్ రూం ద్వారా జిల్లా పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. మాచారెడ్డి మండలం పరిధిపేట గ్రామ శివారులో కారులో పారిపోతున్న ఐదుగురిని ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, లింగంపేట్ ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో వేటగాళ్లను పట్టుకున్నారు. వారి నుంచి కత్తులు, ఆరు సెల్ఫోన్లు, హెయిర్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వాహనాలను ఛేదిస్తూ పట్టుకున్న పోలీసులను, పకడ్బందీగా పెట్రోలింగ్ చేపట్టిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారి అంకితభావాన్ని గుర్తించి తగిన రివార్డు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వేటగాళ్లకు సహకరించిన స్థానికుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారీలో ఉన్నారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రివేళ సంచరించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులకు సూచించారు. ఈ సమావేశంలో ఎఫ్డిఓ శ్రీనివాస్, ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, లింగంపేట్ ఎస్ఐ శంకర్, ఎల్లారెడ్డి అటవీశాఖ రేంజ్ అధికారి ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.