Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటిగుంతలో పడి ముగ్గురు మృతి
- పలు అనుమానాలు.. విచారణ చేపట్టిన పోలీసులు
నవతెలంగాణ-ఎల్లారెడ్డి(లింగంపేట్)
ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన కూతురు, ఆమెను కాపాడబోయిన తల్లి, మేన కొడులూ మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో విషాదం నెలకొంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ఖేడ్ శివారులో శనివారం జరిగింది. స్థానికుల, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లింగంపేట్ మండలంలోని ముంబాజిపేట్ గ్రామానికి చెందిన బోయినీ లింగవ్వ(38) కూతురు రీనా(7)తో కలిసి హైదరాబాద్లో దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగించేది. లింగవ్వ తన కుమార్తెతోపాటు తమ్ముడి కూతురు స్వామిక(9)ను తీసుకుని రెండ్రోజుల కిందట మౌలాన్ఖేడ్ గ్రామంలో బంధువుల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో నిజాంసాగర్ బ్యాక్వాటర్లో ఆడుకోడానికి వెళ్లారు. కాగా వైకుంఠదామం నిర్మాణం కోసం గుంతలు లోతుగా తవ్వగా.. వాటిలో ఇటీవల నీరు చేరింది. ఆడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు రీనా గుంతలో పడిపోగా.. ఆమెను కాపాడేందుకు తల్లి లింగవ్వ నీటిలో దిగింది. ఆమె వెనకాలే మేనకోడలు స్వామిక వెళ్లి నీటిలో పడిపోయింది. ముగ్గురూ మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పలు అనుమానాలు..
ముగ్గురు నీటి గుంతలో పడి మృతిచెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు నీటిలో పడ్డారా..? లేకుంటే ఏవరైనా తోసేశారా..? ఆత్మహత్య చేసుకున్నారా.. అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమెకు భూతగాదాలు ఉండేవని సమాచారం. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గణేష్ పరిశీలించి స్థానికులను విచారించారు. మంబోజిపేట్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.