Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ సభపై మంత్రులు సింగిరెడ్డి, వేముల, తలసాని విమర్శలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ వేర్వేరుగా విమర్శలు గుప్పించారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ... తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా..? అని ప్రశ్నించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రణాళికలో ఇచ్చిన హామీలను రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లో ఎందుకు అమలు చేయటం లేదని విమర్శించారు. తలసాని మాట్లాడుతూ... దేశ రైతాంగం చేసిన పోరాటంలో కాంగ్రెస్ పాత్ర ఏంటని ప్రశ్నించారు. వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ దేశానికి సంబంధించిందా..? లేక రాష్ట్రానికా? అనే విషయాన్ని చెప్పాలని కోరారు. తెలంగాణ కంటే గొప్ప పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏమున్నాయంటూ ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ చెప్పే మాటలను ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.