Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌తో ఉద్యోగాలిస్తున్నాం: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి తారకరామారావు
నవతెలంగాణ-సంగెం
వరంగల్‌లోని అతిపెద్ద ఆజంజాహి మిల్లును ధ్వంసం చేసిన ఘనత కాంగ్రెస్‌దని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఉద్యోగాల కోసం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు స్థాపించి ఇప్పటికి దాదాపుగా 50 వేల ఉద్యోగాల నియామకానికి తోడ్పాటు అందించిన ఘనత కేసీఆర్‌దని చెప్పారు.
మెగా టెక్స్టైల్ పార్కులో కొరియా సంస్థ యంగ్ వన్, కేరళ కంపెనీ కిటెక్స్ట్కి శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. గణేష్ ఈకో పెట్ కంపెనీని ప్రారంభించారు. మెగా టెక్స్టైల్ పార్కులో రూ.100 కోట్లతో మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మంచి క్వాలిటీ పత్తి తెలంగాణ రాష్ట్రంలో దొరుకుతుందన్నారు. అదే ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్‌ను స్థాపించడానికి కారణమని చెప్పారు. గతంలో వరంగల్‌లో ఉన్న ఆజంజాహి మిల్లును ధ్వంసం చేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాకనిరుద్యోగులకు, రైతులకు, పేదలకు అండగా ఉంటూ సరైన పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టెక్స్టైల్ పార్కులో గణేష్ ఈకోపెట్ కంపెనీ పూర్తయి ప్రారంభోత్సవం చేసుకుంటున్నామన్నారు. తద్వారా 30 వేల ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. శంకుస్థాపన చేసిన ఫిక్స్ కంపెనీ ద్వారా రూ.1,600 కోట్ల పెట్టుబడితో 15 వేల ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు. కొరియా కంపెనీ యంగ్ వన్ సంస్థ రూ.1,100 కోట్ల పెట్టుబడితో 12 వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇవేకాకుండా రాబోయే 18 నెలల కాలంలో ఇరవై కంపెనీలు ఇక్కడ ప్రారంభమవుతాయని తెలిపారు. గణేశా ఈకో టెక్ కంపెనీలో మాన్ మేడ్ ఫాబ్రిక్స్ తయారవుతుందన్నారు.
మంచి పథకాలను ప్రజలకు తెలియజేస్తే అవే మనకు ప్రచార అస్త్రాలని కార్యకర్తలకు సూచించారు. మీ ప్రాంతానికి టెక్స్టైల్ పార్క్ రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కారణమని చెప్పారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి అదనంగా అడిగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, దళిత బంధు యూనిట్లను మంజూరు చేస్తున్నట్టు సభాముఖంగా ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ రవీందర్రావు, వివిధ కంపెనీల అధికారులు, జెడ్పీటీసీలు సుదర్శన్‌రెడ్డి, పోలీసు ధర్మారావు, ఎవివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.