Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీ కూలీల ఆందోళన
- వికారాబాద్ జిల్లా పరిగిలో ఘటన
నవతెలంగాణ- పరిగి
ఎండకు మాడిపోతూ.. పొట్టకూటికోసం పోరా డుతున్నా.. వారమంతా పనిచేసినా రూ.400కు మించడం లేదని ఉపాధి హామీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా 11 వారాల డబ్బులకు రెండు వారాల డబ్బులే చెల్లించడంపై నిరసన తెలిపారు. తాము చేసిన పనికి తగ్గ డబ్బులు రాలేందంటూ కూలీలు శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బైటాయించారు. పంచాయతీ సెక్రటరిని నిలదీశారు.
సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో 120 మంది ఉపాధి కూలీలకుగాను 96 మంది పనులు చేస్తున్నారు. తాము కష్టపడి పనిచేసిన కష్టానికి తగిన పలితం రావడం లేదని కూలీలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాతవి, కొత్తవి కలిపి మొత్తం 11 వారాల డబ్బులు రావాల్సి ఉండగా, కేవలం రెండు వారాల డబ్బులు చెల్లించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి కూడా వారానికి రూ.300 నుంచి 400 కూడా రావడం లేదని తెలిపారు. గతంలో వారానికి రూ.1,200 నుంచి 1,400 వచ్చేవని, ఇప్పుడు ఇలా ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసుల జోక్యం చేసుకుని కూలీలను సముదాయించి ఆందోళన విరమింపజేశారు.