Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రజకవత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రజకులకు రుణాలివ్వాలి, వృత్తిప్రదేశాల్లో దోభీఘాట్లు నిర్మించాలనే ప్రధాన డిమాండ్లతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుమ్మడిరాజు నరేష్, పైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని కోరారు. వారితో పాటు సీ మల్లేశ్, జ్యోతి, ఉపేందర్ శనివారం హైదరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వృత్తిదారులు తీవ్ర దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారనీ, పూట కూడా గడవని స్థితిలో ఉన్నారనే విషయం సర్వేలో వెల్లడైందని మంత్రికి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 10లక్షల మంది రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. వీరిలో వృత్తిని నమ్ముకుని బ్రతికేవారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. నదుల్లో,వాగుల్లో,చెరువుల వద్ద బట్టలు ఉతుకుతూ అనేక రకాల ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. వృత్తి చేస్తున్న ప్రతి గ్రామంలో ధోభీ ఘాట్లకు స్థలం కేటాయించీ, నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో లక్షకు పైగా ఇస్త్రీ దుకాణాలు ఉన్నాయనీ, ఇందులో ఎక్కువగా చెక్క డబ్బాలు, చిన్న చిన్న రేకుల షెడ్లు, ఫుట్‌పాత్‌ల పైన ఇస్త్రీలు చేస్తూ పొట్ట పోసుకుంటున్నారని తెలిపారు. వర్షం వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆధునిక షాపుల ఏర్పాటుకు లక్ష రూపాయల రుణాన్ని అందించాలని గతంలో కోరినట్టు గుర్తుచేశారు. 2018 ఎన్నికల ముందు ప్రభుత్వం కోరిన విధంగా 190 జీవో ప్రకారం ఆన్‌లైన్‌్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 50 వేల మంది రజక వృత్తిదారులకు ఫెడరేషన్ నుంచి ఇంతవరకు ఒక్కరికీ రుణాలు ఇవ్వలేదని తెలిపారు. వెంటనే వారందరికీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాలు,మున్సిపాలిటీల్లో అధునాతన యాంత్రాలతో కూడిన దోబీఘాట్లు నిర్మించాలనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్తు పొందుతున్న 64 వేలా మంది రజకులకు రూ:5లక్షల బీమా పథకం ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంస్థల వృత్తి పనుల కాంట్రాక్ట్‌ను రజకులకే ఇచ్చే విధంగా జీ.ఓను తీసుకురావాలని కోరారు.టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్ల కాలంలో రజక వృత్తిదారులపై దాడు లు, దౌర్జన్యాలు, హత్యలు,అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారి రక్షణ కై ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రజక ఫెడరేషన్‌కు పాలకవర్గాన్ని నియమించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.