Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కాంగ్రెస్‌గా కాంగ్రెస్
- ల్యాండ్ పూలింగ్‌కు భూములిస్తే లాభం
- బలవంతంగా తీసుకోం : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
డమ్మీ రాహుల్ పదవేంటో తెలియదని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటనలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో శనివారం విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని వరంగల్ సభలో రాహుల్ అడుగుతున్న క్రమంలో 50 ఏండ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే అవకాశమిచ్చినా ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు, విద్యుత్, ప్రాజెక్టులు లేవన్నారు. రెండుసార్లు ప్రధాని మన్మోహన్‌ను పెట్టి రిమోట్ సోనియాగాంధీ చేతిలో పెట్టుకోలేదా ? అని ప్రశ్నించారు. ప్రధాని మన్మోహన్‌కు సూపర్ పవర్‌గా సోనియా వ్యవహరించలేదా ? అని నిలదీశారు. ప్రధాని మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్‌గాంధే చించేశారని గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలతో దొరికిన మీ ప్రెసిడెంట్‌ను పక్కన పెట్టుకొని అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఎవరు రాజు ..? కేసీఆర్ రాజైతే మీడియా ద్వారా ఇష్టమొచ్చినట్టు తిడితే ఊరుకునేవాళ్లమేనా..? మీ ప్రెసిడెంట్ నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతుంటే ఊరుకునేవాళ్లమేనా ? అని ప్రశ్నించారు. రాజరిక వ్యవస్థ మీదని, మీ ముత్తాత నుంచి మీ వరకు రాజరికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అవుట్ డెడ్ పార్టీ అన్నారు. తమరి సీటులో గెలవలేక కేరళ రాష్ట్రం వచ్చి గెలిచారని అన్నారు. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించారని వ్యాఖ్యానించారు. మీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఎస్లో పనిచేసింది నిజం కాదా ? అని ప్రశ్నించారు.
ఏడు దశాబ్ధాల పాలనలో వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ పాతరేసిందన్నారు. తమరు ప్రకటించిన డిక్లరేషన్‌ను ముందు కాంగ్రెస్ అధికారంలో వున్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అమలు చేసి చూపించండని సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, ఒకవేళ అదే నిజమైతే దేశానికి స్వాతంత్య్రం కూడా బ్రిటీషువాళ్లు ఇచ్చారని అనుకోవాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తామే గుంజుకున్నామని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.17 వేల కోట్ల రుణ మాఫీ చేయలేదా ? అని ప్రశ్నించారు.
ఎయిర్‌పోర్ట్‌కు 400 ఎకరాలు అవసరం
మామునూరు ఎయిర్‌పోర్ట్‌లో ప్రస్తుతం 1.8 కిలోమీటర్ల రన్‌వే వుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెద్ద విమానాలు అంటే బోయింగ్ విమానాలు ల్యాండ్ కావాలంటే రన్‌వే 3.9 కిలోమీటర్లుండాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) అధికారులు చెప్పారని అన్నారు. ఇందుకు మరో 400 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పారు. మామునూరు ప్రాంతంలో భూముల ధరలు గణనీయంగా పెరిగాయని, పక్కనే వున్న డెయిరీ భూములతోపాటు ప్రయివేటు భూములను సేకరించాల్సి వుందన్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన మంత్రులు, కలెక్టర్లు రైతులతో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్టు చెప్పారు.
ల్యాండ్ పూలింగ్తో లాభం
ల్యాండ్ పూలింగ్‌కు భూములిస్తే రైతులకు లాభం జరుగుతుందని, అయినా బలవంతంగా రైతుల నుంచి భూములు తీసుకోబోమని మంత్రి తెలిపారు. భూములిస్తే వాటిని 'కుడా' అభివృద్ధి చేసి ప్లాటింగ్ చేయడం ద్వారా ధర పెరిగి పెద్దఎత్తున నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో అటు రైతులు, ఇటు 'కుడా' లబ్ది పొందుతుందని, ప్రయివేటు వెంచర్లకు లాభాలు ఎందుకు పోనియ్యాలని అన్నారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎంపీలు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజ్ సారయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.