Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
పాడి రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ చెప్పారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాలరైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నర్సింహ్మా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాగర్ ప్రసంగించారు. పాల రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల చివరి వరకు జిల్లా స్థాయి సదస్సులు నిర్వహించాలని చెప్పారు.
గ్రామీణ ప్రాంతంలో పాల ఉత్పత్తి 2వ ఆదాయంగా ఉందని, కానీ అనేక సమస్యలతో పాలరైతులు ఆదాయాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రయివేట్ డెయిరీలు పెద్దఎత్తున విస్తరించి అసలైన పాలరైతులకు నష్టం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని మరింత పెంచడానికి ప్రభుత్వం తరఫున పాడి పశువుల కోసం రైతులకు సబ్సిడీ, పాల ఉప ఉత్పత్తుల తయారీకి ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం బాధ్యత వహించి పాల ఉత్పత్తులను పెంచే క్రమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పాల డెయిరీలను విస్తరించాలని, సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. పాల డెయిరీలకు కావాల్సిన ఫీడ్ అందుబాటులో పెట్టాలని, పాల ఉత్పత్తి తగ్గినప్పుడు సబ్సిడీ ఇచ్చి రైతులు నష్టపోకుండా చూడాలని చెప్పారు. పశువులకు వైద్య సౌకర్యం ఉచితంగా కల్పించాలని, కృత్రిమ గర్భధారణ, వైద్య సౌకర్యం, మొబైల్ వాహనం ద్వారా రైతులకు సౌకర్యాలు అందించాలన్నారు. పాల ఉత్పత్తి సహకార సంఘాలను ఏర్పాటుచేసి, వాటి ద్వారా రైతులకు తగిన శిక్షణ ఇవ్వాలని, ముఖ్యంగా మహిళలకు అవకాశం కల్పించాలని కోరారు. పాల ప్రాసెసింగ్ చేసి ఉప ఉత్పత్తులను వినియోగించే విధంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లా స్థాయిలో పాల ఉత్పత్తిని విశ్లేషించే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, అందులో రైతులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. పాల ధరలను అంతర్జాతీయ ధరలతో సమానంగా నిర్ణయించాలని కోరారు. అన్ని పాడి పశువులకూ బీమా సౌకర్యం కల్పించాలన్నారు.
సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి మాట్లాడుతూ.. పాలపై రైతులకు సబ్సిడీ ఇవ్వడం ఒక్కటే బాధ్యతగా ఉండరాదని, 12 శాతం వెన్న ఉన్న పాలకు రూ.72 ఇవ్వాలని మదర్ డెయిరీ నిర్ణయించిందని చెప్పారు. కానీ లీటరు పాలలో 10 శాతం ఉంటే రూ.60 ఇవ్వాలి కానీ, రూ.40-45 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చిపాల నుంచి వెన్నను తీసే యంత్రాలు వచ్చిన తరువాత 10 శాతం వెన్న ఉన్న పాల నుంచి లీటరుకు 80 గ్రాముల వెన్న తీస్తున్నారని, వెన్నను పాలు కొనుగోలు చేసిన ధరకు మించి అమ్ముకుంటున్నారని తెలిపారు. తిరిగి పాలను అమ్ముకోవడం ద్వారా అదనపు లాభం సంపాదిస్తున్నారని చెప్పారు. ఈ ఫలితాలేవీ పాల రైతులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాడి పశువులకు జబ్బులు వస్తే రైతులు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.శోభన్, పాల రైతు సంఘం నాయకులు మధుసూదన్ రెడ్డి, సి.బాల్రెడ్డి, తావునాయక్, ఐలయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.