Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో ఆలోచింపజేసేలా మేడే వారోత్సవాలు
- మండపాలు, అమరవీరుల స్థూపాలతో పండుగ వాతావరణం
- కార్మికుల కుటుంబాలకు ఆటలపోటీల నిర్వహణ
- అన్ని ట్రేడ్ యూనియన్లకూ, మేధావులు, స్థానికులకు కమిటీల్లో భాగస్వామ్యం
- విజేతలకు బహుమతుల అందజేత
- కార్మికుల సమస్యల్ని, డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కష్టజీవుల పండుగ మేడేపై అసత్యప్రచారాలను తిప్పికొడుతూ...కార్మికుల జీవన విధానంలోనే మార్పులు తెచ్చేలా ప్రత్యామ్నాయ సంస్కృతి రూపొందించే పనిలో సీఐటీయూ పడింది. 'పెట్టుబడిదారీవర్గంపై చేసే యుద్ధంలో కార్మికులకున్న ఏకైక ఆయుధం ట్రేడ్ యూనియన్లే' అన్న కారల్‌మార్క్స్ మాటలను భుజాన వేసుకుని ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నది. తొలి ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల మే ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ మేడే వారోత్సవాలకు పిలుపునిచ్చింది. కార్మికులుండే బస్తీలు, కాలనీల్లోకి వెళ్లి మేడే అమరవీరుల మండపాలను పెట్టి వర్గపోరు, రాజకీయ చైతన్యం ఆవశ్యకతను నొక్కిచెప్పింది. అదే సందర్భంలో కార్మికుల కుటుంబసభ్యులను ఆటాపాట కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసింది. పాలకవర్గాలు, యాజమాన్యాలు కులం, మతం, రంగు, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టి కార్మికులకు చేస్తున్న అన్యాయంపై విడమర్చి చెప్పింది. 'ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోం. కులమేదైనా..మతమేదైనా..రంగేదైనా..ప్రాంతమేదైనా మేమంతా శ్రమజీవులం. కలిసికట్టుగా ముందుకు సాగుతాం' అనేలా కార్మికుల్ని చైతన్యపరిచింది. ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా సీఐటీయూ చేపట్టిన వినూత్న కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. కార్మికుల సమస్యల్ని, డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతం అయింది.
అందరికీ భాగస్వామ్యం
గతంలో మేడే అంటే ఒకటో తేదీన అరుణపతాకాన్ని ఎగురవేసేవారు. అందుకు భిన్నంగా సీఐటీయూ ఆలోచించింది. కార్మిక వర్గంపై కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు చేస్తున్న దాడుల గురించి వారికి విడమర్చి చెప్పాలనే నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే అన్నిచోట్ల మేడే వారోత్సవాలను ఏడు రోజుల పాటు నిర్వహించాలని పూనుకున్నది. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, బీరంగూడ, జహీరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి ఇండ్రస్టీయల్ ఏరియా, రంగారెడ్డి జిల్లా కాటేదాన్, ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్‌లోని భరత్నగర్బస్తీలతో పాటు కార్మికులు ఎక్కువగా ఉండే బస్తీలను ఎంపిక చేసుకుని మేడే వారోత్సవాలను నిర్వహించారు. వీటి నిర్వహణ కోసం స్థానికంగా ఉండే అడ్వకేట్లు, డాక్టర్లు, కాలనీల పెద్దలు, కార్మిక సంఘాల నేతలతో కూడిన ఉత్సవాల కమిటీలను వేశారు. వాటి పర్యవేక్షణలోనే మేడే వారోత్సవాలను నిర్వహించారు.
ప్రతి మండపమూ ఓ సాంస్కృతిక కేంద్రం
ఆయా ప్రాంతాల్లో మేడే వారోత్సవాల వేదికలను ఏర్పాటు చేశారు. అందులో అమరవీరులను స్మరిస్తూ స్థూపాలను పెట్టారు. పొద్దస్తమానం పరిశ్రమల్లో పనిచేయడం.. ఇంటికొచ్చేయడం లాంటి రొటీన్ జీవితాలను గడుపుతున్న కార్మికుల కుటుంబాల్లో ఉత్తేజం నింపేందుకుగానూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రతి రోజూ ఏదో యాక్టివిటీలో పాలుపంచుకునేలా చేశారు. కార్మికుల కుటుంబాలకు ఇదో కొత్త అనుభూతి. ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అన్ని చోట్లా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. డాక్టర్లు రక్తదానం ఆవశ్యకతను విడమర్చి చెప్పడంతో కార్మికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తం ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కార్మికులు ఎక్కువగా ఉండే గణేశ్‌నగర్ బస్తీలో మేడే మండపం వద్ద వారంపాటు ఒక పండగ వాతావరణం నెలకొంది. ప్రతి రోజూ అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను కార్మికుల కుటుంబాలకు చెందినవారు చాలా మంది వీక్షించారు. అక్కడ ఏదో జరుగుతున్నది తెలుసుకోవాలనే ఉత్సుహకతతో చుట్టుపక్కల కాలనీకు చెందిన పిల్లలు, పెద్దలు అక్కడకు వచ్చి క్రీడా, సాంస్కృతిక పోటీల్లో పాలుపంచుకోవడం గమనార్హం. మహిళాకార్మికులు, కాలనీల మహిళలు ముగ్గులు వేయడం, అక్కడ బతుకమ్మలు ఆడటం, కళారూపాలను ప్రదర్శించడంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. బీరంగూడంలో కార్మికులు, రిటైర్డయిన కార్మికులు, కార్మికుల పిల్లలకు విడివిడిగా యాక్టివిటీలు నిర్వహించారు. పిల్లలు ఉత్సాహంగా పాల్గొనటం, మేడే అమరవీరుల స్థూపం వద్దకెళ్లి అక్కడ రాసున్న వాటిని చదవడం, పిడికిళ్లు బిగించి నినాదాలు చేయడం వంటి పరిణామాలను గమనిస్తే వారంతా కార్మికుల పక్షాన పోరాడే ఆశాకిరణాలుగా కనిపించారు. జహీరాబాద్‌లో 400కిపైగా బైకులతో కార్మికులు ర్యాలీ తీయడం పట్టణంలో కొత్తవాతావరణాన్ని తీసుకొచ్చింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి ఇండ్రస్టీయల్ 136వ మేడేను పురస్కరించుకుని 136 అడుగుల అరుణపతాకాన్ని కార్మికులు ప్రదర్శించారు. సంగారెడ్డి, చర్లపల్లిలో మేడే అమరవీరులు, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, సీఐటీయూ పూర్వ నేతల ఫొటోలతో అలంకరించి ప్రభలు కట్టారు. ఆటోలతో ర్యాలీ తీయడంతో ఆయా ప్రాంతాల్లో కొత్త శోభ కనిపించింది. ఇదేంటి? కొత్తగా కార్మికులు ఏం చేస్తున్నారు? మేడే ఆవశ్యకత ఏంటి? అని ప్రజలు తెలుసుకోవడం కనిపించింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు.
క్రీడాపోటీలు..విజేతలకు బహుమతులు
మేడే వారోత్సవాలు నిర్వహించిన అన్ని చోట్లా కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఇది కార్మికుల కుటుంబాలను బాగా ఆకర్షించింది. 'మాతో గొడ్డుచాకిరీ చేయించుకోవడం తప్ప మా గురించి ఇప్పటిదాకా మా బాగోలు, కుటుంబాల గురించి ఆలోచించినోళ్లులేరు. సీఐటీయూ వాళ్లు కొత్తగా చేస్తున్నారు' అని కార్మికుల కుటుంబాల సభ్యులు చర్చించుకోవడం కనిపించింది. పలుచోట్ల మహిళా కార్మికులు, పిల్లలు వేసిన ముగ్గుల కింద కార్మికుల సమస్యలను, డిమాండ్లను ప్రతిబింబించే నినాదాలను రాయడం బాగా ఆకట్టుకున్నది. ఆలోచింపజేసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో క్రికెట్ పోటీలు నిర్వహించగా 11 కంపెనీలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. విజేత టీమ్‌కు రూ.10వేలు, ద్వితీయ విజేత టీమ్‌కు రూ.5వేలు, తృతీయ విజేతకు రూ.2 వేలతో పాటు షీల్డులు, మెమెంటోలు ఇచ్చారు.వాలీబాల్ టోర్నమెంట్లోనూ 8 జట్లు పాలుపంచుకున్నాయి.వీరిలో బీఎంఎస్,హెచ్ఎంఎస్, టీఆర్ఎస్కేవీ, ఐఎన్టీ యూసీ,ఇలా అన్ని యూనియన్లకు చెందిన కార్మికులు పాలుపంచుకోవడం కార్మికుల ఐక్యతను సాధించడంలో తొలి సంకేతంగా చెప్పవచ్చును. కాటేదాన్‌లో అయితే మహారాష్ట్రకు చెందిన టీకొట్టు అతను, బీహార్ వలస కార్మికుడు తమ పనులను త్యాగం చేసి మే ఉత్సవ కమిటీల్లో పాలుపంచుకో వడం చూస్తే కార్మికుల ఐక్యత కోసం వారు పడుతున్న తపన కనిపించింది.
బాగుంది..ఫస్ట్ టైం పాల్గొన్నా..: శిరీష, విద్యావాలంటీర్, కాటేదాన్
మానాన్న వాటర్‌బోర్డులో పనిచేస్తున్నారు. కష్టపడి చదివించారు. టీటీసీ పూర్తిచేసి విద్యావాల ంటీర్‌గా పనిచేస్తున్నాను. కార్మికుల పిల్లల కోసం గేమ్స్ పెట్టడం బాగుంది. ఫస్ట్ టైం పాల్గొన్నా. ముగ్గుల పోటీలో ఫస్టు ప్రైజ్ వచ్చింది. ఈ మండపం వద్ద వారం పాటు పండగ వాతావరణం నెలకొంది. ఆటలపోటీలతో పాటు కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం, అందరూ కలిసికట్టుగా పోరాడాలని చెప్పడం బాగుంది.