Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు
- మీరు కలిస్తే చతురత? రాహుల్ వస్తే టురిస్టా?
- కేసీఆర్ ఓడిపోయినా కాంగ్రెస్ పదవి ఇచ్చింది: పీసీసీ చీఫ్ రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరంగల్ రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించగానే టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు భయం పట్టుకుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. పొగపెట్టగానే కలుగులో ఉన్న ఎలుకలన్నీ బయటకొచ్చేశాయన్నారు. కాంగ్రెస్ పార్టీపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయని విమర్శించారు. ఒకే రకమైన భాషను ఉపయోగించడంతో పార్టీల చీకటి ఒప్పందం బహిర్గతమైందన్నారు. రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే అర్హత మంత్రి కేటీఆర్‌కు లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు పోయి అక్కడి నాయకులను మీరు కలిస్తే చతురత, రాహుల్ ఇక్కడి వస్తే టూరిస్టా? అని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు జె గీతారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబమంతా గాంధీ కుటుంబంతో పోల్చుకునే ప్రయత్నాలను చేస్తున్నదని విమర్శించారు. బ్రిటీష్ ప్రభుత్వానికి దేశస్వాతంత్య్రం కోసం పోరాడింది గాంధీ కుటుంబమని గుర్తు చేశారు. దేశ అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణాలర్పించారని తెలిపారు. అవకాశమున్నా సోనియా, రాహుల్ గాంధీ ప్రధాని పదవిని చేపట్టలేదని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ వంటి మేధావులను కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రిని చేసిందన్నారు. చెప్పకపోయినా దళితులను ముఖ్యమంత్రులుగా చేసిన చరిత్ర కాంగ్రెస్దేన్నారు. కొద్దిరోజుల క్రితం పంజాబ్‌లో దళితుడిని సీఎం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. లోక్‌సభ పక్ష, రాజ్యసభ పక్ష నేతగా మల్లిఖార్జునఖర్గేకు అవకాశం కల్పించిందన్నారు. తెలంగాణలో మల్లు భట్టి విక్రమార్క ప్రధాన ప్రతిపక్షంలో ఉంటే ఓర్వలేక ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనీ, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు.
కేటీఆర్‌కు ఉన్న అర్హత ఏంటి?
రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా? అని రేవంత్ ప్రశ్నించారు. ఏ హోదాలో రాష్ట్రానికి రాహుల్ వచ్చారని కేటీఆర్ ప్రశ్నించారనీ, ఏ హోదాలో కేటీఆర్ రాహుల్‌ను విమర్శిస్తున్నారని అడిగారు. 'శరద్‌పవార్, స్టాలిన్, మమతా బెనర్జీ వద్దకు కేసీఆర్ వెళ్లి రావచ్చా? తెలంగాణ రైతులకు అండగా ఉంటానంటూ ఎంపీ హౌదాలో వచ్చిన రాహుల్‌ను ప్రశ్నిస్తారా? ఇతర రాష్ట్రాల్లో గెలిచి తెలంగాణకు వచ్చిన వారు పొలిటికల్ టూరిస్టులు అయితే వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్న కేసీఆర్‌ను దేశ దిమ్మరి అనాలా? మీరు వెళ్లి కలిస్తే చతురత.. ఇతరులు వస్తే టూరిస్టా?' అని నిలదీశారు.
రేపోమాపో పందికొక్కు బయటకు రావచ్చు
కాంగ్రెస్ పొగపెట్టగానే కలుగులో ఉన్న ఎలుకలన్నీ బయటకు వచ్చాయని రేవంత్ చెప్పారు. పందికొక్కు ఒక్కటే బయటకు రావాల్సి ఉందన్నారు. అది కూడా రేపో, మాపో బయటకు వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. రైతుల కోసం వరంగల్ డిక్లరేషన్ ద్వారా 9 ప్రధానమైన అంశాలను ఆమోదించామన్నారు. రైతు రుణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు, వడ్ల కొనుగోలు తదితర కీలకాంశాలతో ఆయా పార్టీలకు భయం పట్టుకుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే యాదగిరి గుట్ట, అమరవీరుల స్థూపం అవినీతిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమరవీరుల స్థూపాన్ని అద్భుతంగా నిర్మిస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ భాషను కేటీఆర్.. వీరిద్దరి మాటలనే ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతున్నారంటే, ఆ ముగ్గురూ ఒకే రకమైన భావజాలాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. ఒకే రకమైన భాషతో కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్సే
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ భిక్ష, గుర్తింపును ఇచ్చింది కాంగ్రెస్సే పార్టీయేనని రేవంత్ చెప్పారు. కేసీఆర్‌కు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని మంత్రి కేటీఆర్ విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఓటమితోనే ప్రారంభమైందనీ, ప్రజాగ్రహ భయంతోనే ఆయన వేర్వేరు జిల్లాల్లో నాడు ఎంపీగా పోటీ చేశారని చెప్పారు. సిద్ధిపేట నుంచి కరీంనగర్... అక్కడి నుంచి పాలమూరుకు పారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో కేసీఆర్ ఉన్నప్పుడు సింగిల్ విండో డైరెక్టర్‌గా ఓడిపోయినా.. చైర్మన్‌గా పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్ పర్యటనతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందన్నారు. రాహుల్ పర్యటనపై బీజేపీ నేత బండి సంజరు, ఎంపీ అసదుద్దీన్, మంత్రి కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. జీఎస్టీ, కాశ్మీర్ విషయంలో ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ మద్దతు ఇచ్చారా లేదా? చెప్పాలన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఎంఐఎం నేత అసదుద్దీన్ బీజేపీ, టీఆర్ఎస్ ఏజెంట్ అనీ, బ్రోకర్ అని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద ఎంఐఎం ఎందుకు పోటీ పెట్టిందని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ స్థాయి ఏంటో, గౌరవం ఏంటో మొన్నటి ఎన్నికల్లో తేలిందని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన కూడా రాహుల్‌గాంధీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.