Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ అరవింద్ ఇంటి ఎదుట కుప్పలు పోసి నిరసన
- గతంలో ధాన్యం.. ఇప్పుడు పసుపు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో పసుపు బోర్డు డిమాండ్ మళ్లీ తెరమీదకు వచ్చింది. బోర్డు అంశం 'ముగిసిన ముచ్చట' అని ఎంపీ అరవింద్ ప్రకటించిన నేపథ్యంలో గత రెండేండ్లుగా బోర్డు అంశం ఊసేలేదు. కానీ ఇటీవల ఎమ్మెల్సీ కవిత పసుపు బోర్డు అంశంపై ఎంపీ అరవింద్‌పై విమర్శలు ఎక్కుపెట్టడంతో మళ్లీ ముందుకు వచ్చింది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆదివారం ఆర్నూర్లోని పెర్కిట్‌లో ఎంపీ అరవింద్ నివాసం ఎదుట పసుపు రైతులు నిరసన చేపట్టారు. పసుపు కుప్పలు పోసి నిరసన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఎంపీ అరవింద్‌కు, టీఆర్ఎస్కు మధ్య వివాదం ముదురుతోంది. కొనేండ్లుగా స్తబ్ధుగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు.. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియామకమయిన నాటి నుంచి ఎంపీ అరవింద్‌పై విమర్శలు ఎక్కుపెట్టడంతో పాటు గ్రామాల్లో అడ్డుకుంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఎంపీగా తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని ఎంపీ అరవింద్ పసుపు రైతులకు వాగ్ధానం చేశారు. ఒక అడుగు ముందుకేసి బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. ఒకవేళ ఎంపీగా గెలిచిన అనంతరం పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర సర్కారు ముందుకు రాకపోతే.. రైతులతో కలిసి బోర్డు కోసం ఉద్యమంలో పాల్గొంటానని ప్రకటించారు. కానీ అరవింద్ గెలిచి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. బోర్డు ఏర్పాటుకు కేంద్రం అనుమతించలేదు. బోర్డు స్థానంలో స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయం ఏర్పాటు చేసి కేంద్రం చేతులు దులుపుకుంది. దాంతో మళ్లీ బోర్డు ఉద్యమం తెరమీదకు వచ్చింది. గతంలోనూ బోర్డు కోసం స్థానిక రైతులు పలుమార్లు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు.
జీవన్‌రెడ్డి రాకతో మారిన ఉద్యమ తీరు..
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియామకం అయిన నాటి నుంచి ఎంపీ అరవింద్‌ను గ్రామాల్లోనూ అడ్డుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉద్యమాలు నిర్వహించి ఎంపీని అడ్డుకున్నారు. యాసంగి వడ్లు కేంద్రం కొనేందుకు ముందుకు రాకపోవడంతో నిరసనగా ఎంపీ ఇంటి ఎదుట రైతులు వడ్ల కుప్పులు పోసి నిరసన తెలిపారు.
ఇది ఇలా సాగుతుండగా.. ఎమ్మెల్సీ కవిత మొదటిసారి మూడేండ్ల తర్వాత ఎంపీ అరవింద్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. పసుపు బోర్డు అంశంలో ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంతో ఇటీవల విలేకరుల సమావేశం నిర్వహించారు. పసుపు బోర్డు విషయంలో జిల్లా రైతులను ఎంపీ అరవింద్ మోసం చేశారని విమర్శలు గుప్పించారు. నేరుగా మాజీ ఎంపీ, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు గుప్పించడంతో టీఆర్ఎస్ శ్రేణులు సైతం ఎంపీపై విమర్శలు, ఆరోపణలు తీవ్రతరం చేశారు. చివరకు గ్రామాల్లో పర్యటించనీయడం లేదంటూ ఎంపీ అరవింద్ సీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇక తాజాగా ఆదివారం ఆర్మూర్ పట్టణంలో నేరుగా ఎంపీ అరవింద్ ఇంటి ఎదుట పసుపు కుప్పలు పోసి రైతులు ఆందోళన చేపట్టారు.