Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర పాలనపై మంత్రి కేటీఆర్ ఎద్దేవా
- ట్విట్టర్ వేదికగా 'ఆస్క్ కేటీఆర్' కార్యక్రమం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రప్రభుత్వం 'బేచో ఇండియా' (భారతదేశాన్ని అమ్మేయడం) స్కీం అమల్లో బిజీగా ఉందని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఇవ్వబోదని అన్నారు. ఆదివారంనాడాయన 'ఆస్క్ కేటీఆర్' పేరుతో ట్విట్టర్ ద్వారా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. వాటికాయన సమయస్ఫూర్తి, రాజకీయకోణంలో సమాధానాలు ఇచ్చారు. ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 50 పెరిగినప్పుడు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ యుపీఏ ప్రభుత్వాన్ని విమర్శించారనీ, ఇప్పుడు అదే పని కేంద్రప్రభుత్వం చేస్తుంటే స్పందించకపోవడం 'హిపోక్రసీ'నే అని పేర్కొన్నారు. పెట్రోల్ పైన రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్‌లు తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పిన మాట ఆయన ద్వంద ప్రమాణాలకు అద్దం పడుతుందని విమర్శించారు. 2014లో రూ. 410 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు వెయ్యి రూపాయలకు చేరిందని, ఇది కేవలం మోడీ పరిపాలన వల్లనే సాధ్యం అయిందనీ, అచ్చే దిన్‌కు స్వాగతం అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. పెట్రోల్ డీజిల్ తో పాటు ఎల్పీజీ ధరల విషయంలో భారత దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్, బీజేపీ సహా అనేక ప్రతిపక్షాల నుంచి పోటీ ఉంటుందనీ, అయితే ప్రజల ఆశీర్వాదంతో తమ సుపరిపాలన కొనసాగేలా విజయం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ''కాంగ్రెస్ కన్నా గట్టిగా బీజేపీని, ప్రధాని మోడీ విధానాలను టీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్నదనీ, జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించే అవకాశం ఏమైనా ఉందా?'' అని ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు...భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు అంటూ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వదని ఇప్పటికే తేలిపోయిందని, వారి పైన ఆశలు వదులుకున్నామనీ, సొంతంగా ఉద్యోగాల కల్పనపై ప్రయత్నాలు చేస్తున్నామని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా తెలంగాణకు ఐఐఎమ్, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐడీ, ఐఐఐటి వంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఒక్క దానిని కూడా తెలంగాణకు కేటాయించలేదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ అడ్డగోలుగా అమ్మేస్తున్నదని విమర్శించారు. ''అదిలాబాదులో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పున్ణ ప్రారంభించాలని మీరు కేంద్రానికి లేఖ రాసారు కదా... దానికి ఏమైనా స్పందన వచ్చిందా అని ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం బేచో ఇండియా పథకం కింద అద్భుతంగా పనిచేస్తుందనీ, ఇప్పటిదాకా సీసీఐ పై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. రూ.2,500 కోట్లు ఇచ్చి కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటు కొనుక్కోమని చెప్పారన్న బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆపార్టీ నిజస్వరూపాన్ని చూపిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పరిశుభ్రమైన త్రాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని ఓ నెటిజన్ సమస్యను ప్రస్తావించగా, మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే పెద్ద ఎత్తున నల్లా కనెక్షన్లు ఇచ్చామనీ, ఎక్కడైనా కొరత ఉంటే 'మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తామన్నారు. రీజినల్ రింగ్రోడ్కి సంబంధించి భూసేకరణ త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. జహీరాబాద్‌లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్టు భూసేకరణ అత్యంత కీలకమైనదనీ, దీనిపై అనేక మంది పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులకు సంబంధించిన ఏర్పాట్లపై హెచ్ఎండిఎ, టీఎస్ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందనీ. త్వరగా దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరగడంలేదనీ, ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు జరిగితే చూడాలనుకుంటున్నామని ఓ నెటిజన్ ఆకాంక్ష వెలిబుచ్చారు. దీనిపై బీసీసీఐకి చెందిన జై షా, సౌరవ్ గంగూలీలని అడగాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటే అత్యంత సహనంతో కఠినంగా వర్క్ చేయాలని సలహా ఇచ్చారు.