Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో దారుణం
- డాక్టర్, సూపరింటెండెంట్‌ను నిలదీసిన బాధితురాలి బంధువులు
నవతెలంగాణ-నల్లగొండ
పురిటినొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వస్తే డాక్టర్లు నిర్లక్ష్యంగా డెలివరీ చేసి కడుపులో దూది, కట్టుగుడ్డను వదిలివేసిన ఘటన నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన నెర్లకంటి జ్యోతికి నెలలు నిండి పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఈనెల 2న జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో చేరింది. 3న వైద్యులు జ్యోతికి చిన్నాపరేషన్ చేసి ప్రసవం చేశారు. కానీ ఆమె కడుపులో దూది, క్లాత్‌ను వదిలేసి కుట్లు వేశారు. 5వ తేదీన జ్యోతిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికెళ్లిన ఆమెకు మరుసటి రోజునుంచి విపరీతంగా కడుపునొప్పి రావడం ప్రారంభమైంది. దాంతో ఆమె కుటుంబసభ్యులు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో స్కానింగ్ తీయించడంతో అసలు విషయం బయటపడింది. బంధువులు జ్యోతిని వెంటబెట్టుకుని ప్రభుత్వాస్పత్రికి వచ్చి సూపరిం టెండెంట్ను నిలదీశారు. 'బాధితురాలు బతికే ఉంది కదా.. ఇంకా చనిపోలేదు కదా' అంటూ సూపరింటెండెంట్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆగ్రహించిన బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వెంటనే డాక్టర్లు.. వైద్యం చేసి బాధిత మహిళ కడుపులోని దూది, క్లాత్‌ను తొలగించడంతో పరిస్థితి కుదుటపడింది. ఈ విషయంపై వివరణ కోరేందుకు 'నవతెలంగాణ' ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఫోన్లో సంప్రదించగా స్పందించడం లేదు.