Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల, మతాంతర వివాహాల రక్షణకు ప్రత్యేక చట్టం కావాలని 15 ఏండ్ల క్రితమే కోరాం...
- సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ
- రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలపై సుప్రీం జోక్యం తప్పనిసరి
- నాగరాజు కుటుంబాన్ని, భార్యను ప్రభుత్వం ఆదుకోవాలి
- న్యాయం జరిగే వరకు అండగా నిలబడతాం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో కులదురహంకార హత్యల నిరోధానికి ప్రత్యేక చట్టం రూపొందించాలంటూ తాము 15 ఏండ్ల క్రితమే కోరామని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ తెలిపారు. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్పించామని గుర్తుచేశారు. కాని అప్పటి కాంగ్రెస్తో పాటు ఇప్పటి బీజేపీ ప్రభుత్వానికి కూడా ఆ చట్టం రావటం ఇష్టం లేదని తెలిపారు. అందువల్లే ఆ అంశంపై ఆ రెండు పార్టీలు మౌనంగా ఉంటున్నాయని విమర్శించారు. తాము రూపొందించిన ముసాయిదాలో బాధితులకు షెల్టర్, పరిహారం, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారికి రక్షణ తదితర అంశాలున్నాయని తెలిపారు. కాని ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్, బీజేపీ ఆ చట్టంపై నోరు మెదపకుండా చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. 18 ఏండ్లు పైబడిన వారు తమకిష్టమైన వారినెవరినైనా వివాహం చేసుకునేందుకు రాజ్యాంగం హక్కు కల్పించిందని వివరించారు. ఆ హక్కు ప్రకారమే నాగరాజు-ఆశ్రిన్ వివాహం చేసుకున్నారని చెప్పారు. దీన్ని కొంత మంది మతోన్మాదం చేస్తున్నారనీ, తద్వారా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాగరాజు కుటుంబానికీ, ఆశ్రిన్కు కలిపి రూ.75 లక్షల పరిహారం ఇవ్వాలనీ, ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి డబుల్ బెడ్ రూం పథకం కింద ఇంటిని నిర్మించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాగరాజు కుటుంబానికి ఆయన భార్యకు న్యాయం జరిగేంత వరకు తాము అండగా నిలబడుతామని భరోసానిచ్చారు. అప్పటిదాకా ప్రభుత్వాన్ని వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారినీ, హంతకులను, అందుకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆదివారం హైదరాబాద్లోని ఎం.బీ.భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీ.జీ.నర్సింహారావు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబుతో కలిసి సుభాషిణి అలీ విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు చట్టాలు చేస్తున్నాయని ఆమె తెలిపారు. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే హిందూ అమ్మాయిలు-ముస్లీం అబ్బాయిలను వివాహం చేసుకుంటే ఆయా వివాహాల్లో జోక్యం చేసుకుంటున్నాయని విమర్శించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ చర్యలను నిరోధించేందుకు సుప్రీంకోర్టు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హర్యానా ప్రభుత్వం గతంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికున్న షెల్టర్ హౌంకు నిధులివ్వకుండా మూసేసిందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులాంతర వివాహాలు చేసుకున్న వారికిచ్చే ప్రోత్సాహకాలను నిలిపేసినట్టు సుభాషణి అలీ వెల్లడించారు. ప్రభుత్వాలు సీరియస్గా లేకపోవడమే నాగరాజు లాంటి వారి హత్యలకు కారణమవుతున్నాయని చెప్పారు.
ఆ హత్యలప్పుడు మీరెక్కడా?
ప్రణయ్ హత్య విషయంలో గగ్గోలు పెట్టిన ఎర్రజెండాలు నాగరాజు విషయంలో ఎక్కడున్నాయంటూ ప్రశ్నిస్తున్న వారిపై కేవీపీఎస్ స్కైలాబ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి మనిషిగా చూడాలనీ, హత్యను హత్యగా చూడాలని హితవు పలికారు. తెలంగాణలో 70 కుల దురహంకార హత్యలు జరిగితే 69 హత్యల సమయంలో గొంతువిప్పని వారు నాగరాజు హత్యను ఆధారంగా చేసుకుని రగిలిస్తున్నాయని విమర్శించారు. ప్రణరు, మంథని మధుకర్ మొదలు యాదాద్రి-భువనగిరి రామకష్ణ వరకు తామేబాధితుల పక్షాన నిలబడ్డామని తెలిపారు. ఇలాంటి హత్యల సమయంలో ప్రభుత్వాలు నిందితుల తరపున నిలబడుతుండటంతో అవి పునరావృతమవుతున్నాయని స్కైలాబ్ బాబు తెలిపారు. దళితుడైనా నాగరాజు కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలని కోరారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.