Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ మొండి వైఖరి కారణంగానే హత్యలు జరుగుతున్నాయి
- వికారాబాద్లో నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన నేతలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని సీపీఐ(ఎం) పోలిట్బ్యూరో సభ్యులు, దళిత్ సోషణ్ ముక్తి మంచ్ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ సుభాషిణి అలీ, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్వెస్లీ, స్కైలాబ్ బాబు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని ఆదివారం వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. ఇప్పటివరకు 70 కుల దురహంకార హత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి హత్యల నివారణ కోసం పార్లమెంట్, శాసనసభ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చ జరిపి కఠిన చట్టాలను తీసుకరావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇలాంటి చట్టాల కోసం 20 ఏండ్లుగా సీపీఐ(ఎం) పోరాటం చేస్తున్నా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి హత్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు ఉన్నాయని, వారికి నచ్చిన వారితో పెండ్లి చేసుకోవడానికి రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. వాటిని పక్కన పెట్టి కుల దురహంకార హత్యలకు పాల్పడటం హేయమైన చర్య అని తెలిపారు. నాగరాజుపై దాడి జరుగుతున్న సమయంలో అతడి భర్య సాహసంతో ఎదుర్కోవడం హర్షించదగ్గ విషయమన్నారు.
అలాంటి అమ్మాయికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందని తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకుంటున్న జంటలకు కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. నాగరాజు కుటుంబానికి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, మూడెకరాల భూమి కేటాయించాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్యం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేష్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవి, మైపాల్ బాబు, నాయకులు మాసన్న పద్మారావు, బాల్రాజ్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.