Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ బస్సులు తిప్పేందుకు ప్రణాళికలు
- పరిగి ఆర్టీసీ డిపోపై రూమర్స్ నమ్మవద్దు : వీసీ సజ్జనార్
నవతెలంగాణ-పరిగి
రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా ఆర్టీసీ డిపోను ఎత్తివేయడం లేదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్, డిపోను ఆయన సందర్శించారు. డిపోలో ఉన్న మెకానిక్ షెడ్, పరిసరాలను పరిశీలించి వాటిని శుభ్రంగా పెట్టుకోవాలని సంబంధిత బాధ్యులకు సూచించారు. అనంతరం సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. పరిగి ఆర్టీసీ డిపోలో డీఎం పవిత్ర, డీవీఎం జ్యోతి, ఇతర సిబ్బంది బాగా పని చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ, కేఎంపీఎల్‌లో బాగా పని చేస్తున్నందుకు వారిని అభినందించారు. ప్రజలు ఆర్టీసీని బాగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బస్సులో ప్రయాణిస్తున్నారని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రూట్లను నేషనలైజ్ చేశామన్నారు. త్వర లోనే ఆర్టీసీ యజమాన్యం 1,016 కొత్త బస్సులను తీసుకుంటుందని వివరిం చారు. హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ వాహనాలను పంపేం దుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. దూరప్రాంతాలకు స్లీపర్, ఏసీ, నాన్ ఏసీ బస్సులు నడిపేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు వివరించారు. ప్రజలు సురక్షితంగా, ప్రశాంతంగా గమ్యస్థానాలకు చేరాలంటే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని సూచించారు. తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పడుతోందనీ, త్వరలో కార్మికుల సమస్యలు సైతం పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పరిగి డిపో నుంచి కూడా ఆదాయం పెరిగిందనీ, ఈ డిపోను ఎత్తివేయడం, లీజుకివ్వడం, అమ్మడం లేదనీ ఈ రూమర్స్‌ను ఎవ్వరూ నమ్మవద్దని తెలిపారు. ఇక్కడున్న వనరులను ఉపయోగించుకుని కమర్షియల్‌గా ఆదాయం పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే కర్నాటకలోని గుల్బర్గా, సేడం తదితర ప్రాంతాలకు బస్సులు నడుపుతామని తెలిపారు. కార్యక్రమంలో డీఎం పవిత్ర, డీవీఎం జ్యోతి, ఆర్టీసీ డీఈ రామచంద్రసింగ్, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంజయ్య, ఆర్టీసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.