Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
వసిరా కవిత సంపుటి సెల్ఫీ పుస్తకావిష్కరణ రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ మినీ థియేటర్లో జరిగింది. ముఖ్యఅతిధిగా డాక్టర్ శివారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మెన్, కవి నందిని సిధారెడ్డి అధ్యక్షత వహించారు. శివారెడ్డి మాట్లాడుతూ.. ఖగోళశాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్ తన మేధస్సుతో రోదసీని అద్భుతంగా మలిస్తే.. వసీరా తన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని కళ్లకుకట్టినట్టు ఆవిష్కరించారని వివరించారు. స్నేహ స్వభావం లేనివాడు కవి కాలేడు. మనిషీ కాలేడు. కవి మార్పును గమనిస్తాడు. సమాజం ఎదుర్కొంటున్న కష్టనష్టాలను కళ్లారా చూసి ..ఇతరులను కదిలించేదే కవిత్వమని స్పష్టం చేశాడు. అయితే సమాజంలో ఇతరులకు హానికలిగించని ఆధ్యాత్మికత అవసరమనీ, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రమాదకరమని శివారెడ్డి నొక్కి చెప్పారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ..వసీరా కవితల్లో సమాజంలో మార్పులు చెందిన ప్రభావం కనిపిస్తోందన్నారు. అనేక కోణాలు, మరెన్నో పరిణామాలు వసీరా కవితల్లో ఉంటాయన్నారు. లోహనది తర్వాత రాసిన ఈ సెల్ఫీ కవితల్లో ఆధ్యాత్మికత, అధిభౌతికత మేళవించినట్టు ఉన్నదని వివరించారు. అంతకుముందు 60 కవితలతో ఉన్న సెల్ఫీ పుస్తకాన్ని ఆవిష్కరించి..తొలి ప్రతిని పెమ్మరాజు గోపాలకృష్ణకు అందజేశారు. ప్రత్యేక అతిథిóగా పాల్గొన్న తెలంగాణ సాంస్కతిక వ్యవహారాల శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ వసీరా కవితలను ప్రస్తావిస్తూ..తాము పెద్దల కవితలను స్ఫూర్తిగా తీసుకుని ఎదిగామని తెలిపారు. వసీరా కవితల్లో ఉన్న ఉద్వేగం,భావోద్వేగం స్పష్టంగా ఉంటుందనీ, ఇలాంటి శైలి ఇప్పటికీ కొనసాగటం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వక్తలు డాక్టర్ కాళ్లకూరి శైలజ, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, కవి సతీశ్చందర్, కవులు ముక్కామల చక్రధర్, సీతారాం, అద్దేపల్లి ప్రభు తదితరులు వసీరా రాసిన కవితలు, అందులో ఉన్న బంధాలు, అనుబంధాలను ప్రస్తావించారు.