Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతాంతర వివాహం చేసుకున్న బి.నాగరాజును ఆయన భార్య అశ్రీన్ సుల్తానా సోదరులు హత్య చేయడాన్ని సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. నాగరాజు భార్యకు రక్షణ కల్పించాలనీ, కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గత కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల,మత దురహంకార హత్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులను ఆశ్రయించినా రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో కుల దురహంకార హత్యలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు ఎప్పుడూ స్పందించలేదన్నారు. ప్రస్తుతం నాగరాజు ఘటన విషయంలో మతం రంగు పులుముతున్నదని విమర్శించారు. మత రాజకీయాలను ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. నాగరాజు హత్యను అన్ని తరగతుల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎటువంటి దుర్మార్గాలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కనీస వేతనాల జీవోలు వెంటనే విడుదల చేయాలి
రాష్ట్రంలో ఏడేండ్లుగా షెడ్యూల్ ఎంప్లాయిమెంట్లలో కనీస వేతనాలు సవరించకుండా కార్మికులకు తీవ్ర నష్టం చేస్తున్నదనీ, కార్మిక శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపిన యాజమాన్యాల ప్రయోజనాల కోసం కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. దీని వల్ల 75 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమల పరిధిలోని సుమారు కోటీ 20 లక్షల మంది నష్టపోతున్నారని వివరించారు. 15 ఏండ్ల నుంచి పారిశ్రామిక రంగంలో కనీస వేతనం పెరగపోతే కార్మికుల కుటుంబాలు ఎలా బతుకుతాయని ప్రశ్నించారు. అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా రాష్ట్ర సర్కారు స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని కనీస వేతనాలు జీవోలు విడుదల చేయాలని కోరారు. లేదంటే మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, పి.రాజారావు, పి.జయలకీë, జె.మల్లికార్జున్, వీఎస్.రావు, కళ్యాణం వెంకటేష్, టి.వీరారెడ్డి, ఆర్.కోటంరాజు, ఎ.జె.రమేష్, రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, జె.వెంకటేష్, ఎస్.రమ, బి.మధు, ఎ.ముత్యరరావు, బి.మల్లేష్, జె.చంద్రశేఖర్, ఆర్.త్రివేణి, ఎం.వెంకటేష్, రాగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.