Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-దామరచర్ల
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం వద్ద గల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఓ కార్మికుడు ఆదివారం దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని గోలాఘాట్ ప్రాంతానికి చెందిన రుతూ కాక్లారి (46) విద్యుత్ కేంద్రంలో నిర్మాణ పనులు చేస్తున్న పవర్మెక్ అనే కాంట్రాక్ట్ కంపెనీలో 6 నెలల నుంచి కార్మికునిగా పని చేస్తూ కంపెనీ ఇచ్చిన గదిలోనే మరో ఐదుగురు కార్మికులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కార్మికులంతా పనులు ముగించుకొని తమ గదికి వచ్చి నిద్రపోయారు. కాగా ఆదివారం ఉదయం తోటి కార్మికులు నిద్ర లేచే సరికి గదిలో కాక్లారి కనిపించలేదు. పని మీద బయటికి వెళ్లి ఉండొచ్చని భావించారు. ఎంత సేపటికి అతను రాకపోవడంతో ఈ విషయాన్ని కాంట్రాక్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారంతా కలిసి గది పరిసర ప్రాంతాల్లో వెతకగా కాక్లారి మృతదేహం కనిపించింది. అతన్ని గొంతుకోసి దారుణంగా హత్య చేసినట్టుగా ఉంది. కాంట్రాక్టు కంపెనీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విలేకర్లను అనుమతించని సెక్యూరిటీ..
కార్మికుని హత్య విషయం తెలుసుకొని సమాచార సేకరణకు యాదాద్రి పవర్ ప్లాంట్ వద్దకు వెళ్లిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకర్లను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. లోపలికి అనుమతి లేదని వారించారు. గంటల కొద్దీ జర్నలిస్టులు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో వెనుదిరిగారు.