Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అస్తవ్యస్తంగా భూరికార్డులు
- నిజామాబాద్ జిల్లా కేంద్రం భూముల వివరాల్లేవ్
- పాత అధికారుల పేరుతో తప్పించుకుంటున్న వైనం
- భూ సమస్యలపై పేరుకుపోతున్న ఫిర్యాదులు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భూరికార్డుల నమోదు అస్తవ్యస్తంగా, గందరగోళంగా తయారయ్యింది. పట్టా భూములు లేదా వ్యవసాయ భూముల గురించి రెవెన్యూ అధికారులను సమాచారం అడిగితే 'చూస్తాం.. లేదు.. ఇవ్వలేం' అంటూ సమాధానం వస్తోంది. ముఖ్యంగా ఆర్ఓఆర్ రికార్డులన్నీ మాయమయ్యాయి. రిజిస్ట్రేషన్ దస్త్రాల్లో అధికారికంగా తహసీల్దార్ కార్యాలయం స్టాంపులున్నప్పటికీ.. ఆ వివరాలు సంబంధిత కార్యాలయ రికార్డుల్లో లేకపోవడం గమనార్హం. దాంతో భూసమస్యలపై ఫిర్యాదులు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులు పాత అధికారుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యకు పరిష్కారం చూడటం లేదు.
నిజామాబాద్ జిల్లాలో నూతన మండలాల ఏర్పాటు సమయంలో జిల్లా కేంద్రంలో ఉత్తర, దక్షిణ, గ్రామీణ ఎమ్మార్వో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కార్యాలయాల కేంద్రంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరుగుతోంది. కానీ జిల్లాలో భూముల రికార్డు పూర్తి గందరగోళంగా తయారయ్యింది. పాత రికార్డులేవి పరిశీలించినా భూముల వివరాలు వెల్లడి కావడం లేదు. 2015 నుంచి భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో ఆ వివరాలు మాత్రమే ఆడపాదడపా అందుతున్నాయి. అంతకముందు వివరాలేవీ వెల్లడికావడం లేదు. రెవెన్యూ ఆఫీసర్లను తొలగించిన అనంతరం ఆ రికార్డుల సేకరణ, భద్రపరచడం సరిగ్గా చేయలేదు. గతంలో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ జరిగితే ఆర్ఓఆర్ రిజిస్టర్లో నమోదు చేసేవారు. భూమి అమ్మకందారు, కొనుగోలుదారు వివరాలతో పాటు ఏ తేదీన రిజిస్ట్రేషన్ జరిగింది, ఎంత విస్తీర్ణంలో కొనుగోలు అమ్మకం జరిగిందన్న వివరాలన్నీ ఆ రిజిస్టర్లో నమోదు చేయాలి. కానీ దక్షిణ ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్ఓఆర్ రిజిస్ట్రర్ మాయం కావడం గమనార్హం. భూములకు సంబంధించిన వివరాలు తహసీల్దార్‌ని అడిగితే డిప్యూటీ తహసీల్దార్‌పై నెట్టేయడం, ఆయనరికార్డులు చూసే ఉద్యోగిపై నెట్టడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా దక్షిణ తహసీల్దార్ కార్యాలయంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఏ భూమికి సంబంధించిన వివరాలు అడిగిన మొదట 'మా కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. కాబట్టి వివరాల్లేవు' అని సమాధానం వస్తోంది. 2010లో ప్రమాదం జరగగా.. 2015కు సంబంధించిన భూలావాదేవీల వివరాలు అడిగినా లభించడం లేదు. ఇదేంటని అడిగితే.. పాత తహసీల్దార్లు ఉన్న సమయంలో రికార్డుల నమోదు సరిగ్గా జరగలేదని సమాధానం వస్తోంది.
భూరిజిస్ట్రేషన్ సమయంలో ఎమ్మార్వో కార్యాలయ స్టాంప్‌తో పాటు పట్టా పాస్‌బుక్ కలిగి ఉన్న భూయజమానుల భూముల వివరాలు కూడా ఇచ్చే పరిస్థితిల్లో లేదు. ఒకవేళ ఇది ఇలానే కొనసాగితే జిల్లా కేంద్రంలో భూములకు సంబంధించిన వివాదాలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూములు 'మావంటే మావంటూ' వివాదాలు చెలరేగుతున్నాయి. ఇటీవల అధికారపార్టీలోనే రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
రుణాల్లో కొర్రీలు..
నగర విస్తరణలో భాగంగా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మలిచి విక్రయించిన భూముల వివరాలు ప్రస్తుతం వెల్లడికావడం లేదు. ఫలితంగా మధ్యతరగతి ప్రజానీకం ఆ ప్లాట్లలో ఇండ్లు కట్టుకునేందుకు రుణాల కోసం బ్యాంకులకు వెళ్తే మంజూరు కావడం లేదు. ప్లాట్లు చేసేందుకు ముందు జరిగిన భూముల క్రయవిక్రయాల వివరాలు అడుగుతున్నారు. ఆ వివరాలు తహసీల్దార్ కార్యాలయాల్లో లభించడం లేదు. ఫలితంగా ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని బాధితులు వాపోతున్నారు.