Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారతదేశంలో జరిగే భవిష్యత్ వర్గపోరాటాల్లో కమ్యూనిస్టులదే కీలకపాత్ర అవుతుందని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. కమ్యూనిస్టుల ఏకీకరణపై మరిన్ని పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. సైద్ధాంతికపరమైన అంశాలను విశ్లేషించి, చర్చను సమగ్రంగా నిర్వహించేందుకు పుస్తకాలు దోహదపడతాయన్నారు. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి మఖ్దూం భవన్లో కందిమళ్ల ప్రతాపరెడ్డి రచించిన 'మరవరాని మన చరిత్ర' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికాయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధం లేనివారు దాన్ని హిందూ ముస్లిం కొట్లాటగా చిత్రీకరిస్తున్నారనీ, ఈ వాస్తవాలను భవిష్యత్ తరాలకు పుస్తకాల ద్వారా అందించాలని చెప్పారు. మార్క్సిజానికి కాలం చెల్లిందని ప్రచారం చేస్తున్నారనీ, ఇది తాత్కాలిక అవరోధమేనన్నారు. దేశంలో జరిగే వర్గపోరాటాలకు కమ్యూనిస్టులే నాయకత్వం వహిస్తున్నారనీ, భవిష్యత్లో ఇవి మరింత కీలక కార్యాచరణతో ముందుకు వెళ్తాయని చెప్పారు. సాయుధ పోరాట కాలం నాటి మనకు తెలియనటువంటి అనేక అంశాలు సర్వదేవభట్ల రామనాథం జీవిత చరిత్ర, బూర్గుల నరసింహారావు రచించిన పుస్తకాల ద్వారా తెలుసుకోగలుగుతున్నామని అన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ చరిత్ర పరిశోధకులు వకుళాభరణం రామకృష్ణ మాట్లాడుతూ చరిత్ర అన్ని శాస్త్రాలకు తల్లి లాంటిదని తెలిపారు. సామాజిక, రాజకీయ, భౌతిక, జీవశాస్త్రం వంటి అనేక శాస్త్రాలను మినహాయిస్తూ, పాఠ్యాంశాల్లో చరిత్ర పుస్తకాలను పాలకులు తొలగించాలని చేస్తున్న ప్రయత్నాలు చాలా ప్రమాదకరమైనవని ఆందోళన వ్యక్తం చేశారు. అరసం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నవచేతన పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్ ప్రసాద్, తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ఎస్వీ సత్యనారాయణ, జర్నలిస్టు పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.