Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో రోడ్డెక్కిన అన్నదాత
నవతెలంగాణ- వెల్గటూర్/కమ్మర్పల్లి
ఆకాశంలో మబ్బులు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వర్ష సూచనల నేపథ్యంలో చేతికందొచ్చిన ధాన్యం ఎక్కడ నేలపాలు అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటుచేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై భైటాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జగిత్యాల జిల్లా వెల్గటూర్‌కు చెందిన రైతులు.. కొనుగోళ్లలో జాప్యం కారణంగా ధాన్యం నీటిపాలవుతోందని, వాన నుంచి ధాన్యాన్ని కాపాడుకోడానికి నానా తిప్పలు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ కరీంనగర్ రాయపట్నం రాష్ట్ర రహదారిపై కిషన్ రావుపేట స్టేజి వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. సీఎంఓ ముఖ్య సలహాదారు స్మిత సబర్వాల్, రాజత్ కుమార్‌తో పాటు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన జిల్లాలో ఉండగా రైతులు రోడ్డుపై బైటాయించారు. మిట్ట మధ్యాహ్నం నాలుగు గంటలపాటు ఆందోళన కొనసాగగా కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఒంటి గంటకు ధర్మపురి సీఐ కోటేశ్వర్, తహసీల్దార్ వి.రమేష్ రైతులను ధర్నా విరమింపజేసేందుకు ప్రయత్నించినా వినలేదు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పది రోజుల్లో కేవలం పది మంది రైతుల ధాన్యాన్నే తూకం వేశారన్నారు. తమ గ్రామంలోనే నాలుగు బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నా ఒక్కరు కూడా ఎందుకు ధాన్యం తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టిన ధాన్యాన్ని కూడా రైస్‌మిల్లులకు తరలించడంలేదని, దాంతో వర్షం పడినప్పుడల్లా వడ్లు, సంచులు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలం దగ్గరపడుతుండటంతో ఇంకా ఎప్పుడు పంట పనులు మొదలు పెట్టుకోవాలో తెలియడంలేదని, వారాలకు వారాలు వడ్లు అమ్ముకునేందుకే మార్కెట్లలో పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన చెందారు. తహసీల్దార్ రమేష్ స్పందిస్తూ రైస్ మిల్లర్లతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో ఏర్పాటుచేసిన చౌట్పల్లి సింగిల్ విండో పరిధిలో హసాకొత్తూర్, బషీరాబాద్, చౌట్పల్లి గ్రామాలున్నాయి. చైర్మెన్ కుంట ప్రతాప్‌రెడ్డి స్వగ్రామం చౌట్పల్లిలో, వైస్‌చైర్మెన్ గడ్డం శ్రీధర్‌రెడ్డి స్వగ్రామం హసాకొత్తూర్‌లో వరి ధాన్యం సేకరణ వేగవంతంగా పూర్తి చేస్తున్నారని, తమ ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం లేదని బషీరాబాద్ గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని రైతులు ఎన్నోసార్లు చైర్మెన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు. చైర్మెన్ కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు గ్రామంలో రెండు లోడ్ల వడ్లు మాత్రమే కొనుగోలు చేశారని, ఇంకా ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలు పేరుకుపోయాయని, అకాల వర్షం కురిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ ధాన్యం సకాలంలో కొనుగోలు చేసే విధంగా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.