Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరగబడుతున్న కార్మికులు
- వెల్లువెత్తుతున్న నిరసనలు
- డొక్కు బస్సులతో మైలేజ్ ఎలా?
- 6,500 బస్సుల్లో 5,155 స్క్రాప్ బస్సులే...
- మైలేజ్ తేకుంటే జీతంలో కోస్తామంటూ నోటీసులు
- హడలెత్తుతున్న డ్రైవర్లు...
- టిక్కెట్లు చింపేసి కండక్టర్లపై కేసులు రాస్తున్న చెకింగ్ స్క్వాడ్స్
- వీఆర్ఎస్ అమలుకు యాజమాన్యం డొంకదారులు
- తీవ్ర మనోవేదనలో ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు
ఎస్ఎస్ఆర్ శాస్త్రీ
టీఎస్ ఆర్టీసీలో సంక్షేమ మండళ్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పలుమార్లు ప్రకటించారు. కార్మిక సంఘాలు అనవసరంగా రోడ్డెక్కుతున్నాయనీ, యాజమాన్యంతో కలిసి రావాలనీ పిలుపునిచ్చారు. సంక్షేమ మండళ్లు అంతబాగా పనిచేస్తే రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు ఎందుకు సంయమనం కోల్పోతున్నారో, నిరసనలకు దిగుతున్నారో అర్థం కావట్లేదు. నిత్యం ఏదో ఒక బస్ డిపోలో యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు గళం ఎత్తుతూనే ఉన్నారు.
నిజామాబాద్‌లో...
నిజామాబాద్ ఆర్టీసీ డిపో-2లో డ్రైవర్ గణేష్ నగంగా డిపో మేనేజర్ ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. 15 ఏండ్లుగా ఆయన అదే డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఒక్క రిమార్కు కూడా ఆయనపై లేదు. కిలో మీటర్ పర్ లీటర్ (కేఎమ్పీఎల్) తగ్గిందంటూ ఈ మధ్యే ఆయన్ని డిపో మేనేజర్ దగ్గరకు కౌన్సిలింగ్‌కు పంపారు. వారం తిరక్కుండానే మళ్లీ మైలేజ్ తక్కువ వస్తుందంటూ కౌన్సిలింగ్ కోసం డిపో మేనేజర్ దగ్గరకు వెళ్లమని నోటీసు ఇచ్చారు. దీంతో సహనం నశించిన గణేష్ డిపో మేనేజర్ ఎదుట బట్టలు విప్పేసి, నిరసన తెలిపారు. డొక్కు బస్సులు ఇచ్చి మైలేజ్ తెమ్మంటే ఎలా వస్తుందని ప్రశ్నించారు. దీనిపై యాజమాన్యం స్పందించలేదు...ఆదేదో చిన్న విషయంగా పట్టించుకోనట్టే వ్యవహరించింది.
మిథాని డిపోలో...జీతం నుంచి రికవరీ...
మిథాని డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జీ వెంకన్నకు డిపో మేనేజర్ నోటీసు ఇచ్చారు. ''ఏప్రిల్ నెలలో మీరు సుమారు 4,400 కి.మీ., నడిపించినారు. 948 లీటర్ల డీజిల్ ఖర్చు చేసినారు. 4.64 కేఎమ్పీఎల్ తెచ్చినారు. కానీ బస్సు యొక్క రకం సూపర్ లగ్జరీ. కేఎమ్పీఎల్ 5.20 గా ఉన్నది. మీరు 5.20కి బదులుగా 4.64 కేఎమ్పీఎల్ తెచ్చినారు. దీనివల్ల 102 లీటర్లు ఎక్కువ ఖర్చు చేశారు. నష్టము రూ.10,710. ప్రస్తుతం డిపో రూ. మూడు కోట్ల నష్టంలో ఉన్నది. మీవల్ల అదనంగా నష్టం పెరుగుచున్నది. కావున మీరు చేసిన నష్టమును మీ జీతము నుండి రికవరీ ఎందుకు చేయకూడదో ఏడు రోజుల్లో వివరణ ఇవ్వగలరు''...ఇదీ ఆ నోటీసు సారాంశం.
పరిగిలో మహిళా కండక్టర్ అదృశ్యం...
ఆర్టీసీ అధికారుల వేధింపులు భరించలేక పరిగిలో అలకుంటు లక్ష్మి అనే మహిళా కండక్టర్ అదృశ్యమైంది. ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన ఆమెకు ధైర్యం చాల్లేదు. ఇటీవలే ఆమె కూతురు చనిపోయింది. ఆ బాధను కడుపులో దిగమింగుకొని డ్యూటీకి వస్తే టీటీఐ (చెకింగ్ స్క్వాడ్)లు కుట్ర పూరితంగా తనపై తప్పుడు కేసు రాసారని మనస్తాపానికి గురై మార్గమధ్యంలోనే బస్సు దిగిపోయి అదృశ్యమైంది. ప్రయాణీకులకు తాను టిక్కెట్లు ఇస్తే, టీటీఐలు ఉద్దేశ్యపూర్వంగా వాటిని మాయం చేసి తనపై కేసు రాసారనేది ఆమె ఆవేదన. మూడు రోజుల తర్వాత పోలీసులు ఆమెను కనుగొని, పోలీస్టేషన్‌కు తీసుకొచ్చారు.
మహేశ్వరంలో...
ఈ డిపోలో చెన్నకేశవులు కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గత నెల 30న డ్యూటీకి వచ్చినా, అక్కడి సహాయ మేనేజర్ ఎన్ యాకూబ్ ఆబ్సెంట్ వేశారు. దీనిపై వివరణ కోరితే 'అదంతే' అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో సహనం నశించిన చెన్నకేశవులు డిపోలోనే యాకూబ్‌పై దాడి చేసి, గాయపరిచాడు. గతంలోనూ డిపో అధికారులు డ్రైవర్, కండక్టర్ల పట్ల ఇలాగే వ్యవహరించారనీ, డ్యూటీకి వస్తే ఆబ్సెంట్లు వేసి జీతంలో కోత పెడుతున్నారని చెన్నకేశవులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయనపై మహేశ్వరం పోలీస్టేషన్లో కేసు నమోదైంది.
ఇవి కొన్నే...
ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఘటనలు నిత్యం డిపోల్లో కార్మికులు ఎదుర్కొంటున్నా రు. సంస్థను లాభాల్లోకి తేవాలంటే కార్మికుల సహకారాన్ని యాజమాన్యం కోరాలి.కానీ పొమ్మనలేక పొగబెట్టినట్టు కార్మికుల్ని మానసికంగా కుంగదీసి, వాళ్లంతట వాళ్లే వీఆర్ఎస్ తీసుకొని ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోయేలా యాజమాన్యం వ్యవహరిస్తున్న దని కార్మిక సంఘాలు ఆక్షేపిస్తున్నాయి.
సంక్షేమ మండళ్లు ఏవి సారూ...?
ఆర్టీసీలో ఇన్ని వరుస సంఘటనలు జరుగుతుంటే సంస్థ చైర్మెన్, ఎమ్డీ చెప్తున్న సంక్షేమ మండళ్లు ఎక్కడ ఉన్నాయని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సంస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారాన్ని అర్థించకుండా, దాన్ని ప్రిస్టేజ్‌గా తీసుకొని, తమంత తామే అన్నీ సర్దుబాటు చేస్తామనే ధోరణిని యాజమాన్యం విడనాడాలని హితవు చెప్తున్నాయి. 2015 తర్వాత ఇప్పటి వరకు కార్మికులకు రావల్సిన రెండు వేతన సవరణలు ఎందుకు అమలు చేయలేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ కార్పొరేషన్ ఉద్యోగులకు సైతం పీఆర్సీ అమలు చేస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నదని ప్రశ్నిస్తున్నారు. ప్రజారవాణాను సామాజిక బాధ్యతగా చూడటం మానేసి, దాన్ని వ్యాపార, వాణిజ్య పరంగా చూస్తే ఫలితాలు రావనీ, ఆర్టీసీ చచ్చిపోతుందని ఓ కార్మిక సంఘ నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం అనసవరమైన భేషజాలకు వెళ్లకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నాయి. ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాయి.
అద్దె బస్సులదే హవా...
ప్రస్తుతం టీఎస్ఆర్టీసీలో దాదాపు 6,500 బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరినాటికి వాటిలో 5,155 బస్సులు తుక్కు (స్క్రాబ్)గా మారుతున్నాయి. వీటిలోనూ దాదాపు 4వేల బస్సులు ఇప్పటికే తుక్కు కింద మారాయి. అయినా వాటికి మరమ్మతులు చేసి రోడ్లపై తిప్పుతున్నారు. ఈ డొక్కు బస్సులకు మైలేజ్ రావట్లేదంటూ కార్మికులను రాచిరంపాన పెడుతున్నారు. ఇవికాకుండా ఇదే ఆర్టీసీలో మరో మూడువేల అద్దెబస్సులు ఉన్నాయి. తుక్కు కింద మారిన ఆర్టీసీ బస్సుల్ని తీసేస్తే మిగిలేది కేవలం 1,445 బస్సులు మాత్రమే. ఇటీవలే ఆర్టీసీకి మరో వెయ్యి బస్సులు కొంటామని ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటించారు. ఆ సంఖ్యను కూడా కలుపుకుంటే ఆర్టీసీలో ఉండేది కేవలం 2,445 బస్సులు మాత్రమే. అంటే అద్దె బస్సులకంటే ఆర్టీసీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్నమాట! మరి రాష్ట్రంలో ఆర్టీసీ ఉన్నట్టా...ఉనికి కోల్పోతున్నట్టా??