Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4వ ఆర్థిక చోదకశక్తిగా రాష్ట్రం
- గ్రూప్ -1 ఉర్దూలో రాస్తే తప్పేంటి?
- మాట్లాడితే.. హిందూ..ముస్లిం అంటరు
- బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్
నవతెలంగాణ - నారాయణపేట టౌన్
దేశంలోని 29 రాష్ట్రాల్లో 4వ ఆర్థిక చోదకశక్తి రాష్ట్రంగా వెలుగుతోంది.. కానీ కొందరు నేతలు కారుకూతలు, పచ్చి అబద్ధాలతో రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మంత్రి మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కేంద్రం డబ్బులున్నాయని ఒకాయన పాదయాత్రలు చేస్తూ అడ్డం పొడవు మాట్లాడుతున్నారని చెప్పారు. మరి కేంద్రం పైసలే మన పథకాల్లో ఉంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాలు అమలు కావాలి కదా? అని ప్రశ్నించారు. గట్టిగా నిలదీస్తే హిందూ. ముస్లిం, భారత్, పాకిస్తాన్ అంటరు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా జలాల్లో నీటి వాటాను తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందిందని కొందరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఎనిమిదేండ్ల నుంచి అడుగుతున్నాం.. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల హక్కు ఇవ్వాలని, పంపకాలు తేల్చాలని అడిగాం. ప్రాజెక్టులు కట్టకుండా సతాయించారు.. పాలమూరు జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాకు 575 టీఎంసీల నీటిని ఇవ్వండని కోరుతూనే ఉన్నాం. స్వయంగా మోడీని కేసీఆర్ అడిగారు. అయినా ఉలుకుపలుకు లేదని కేటీఆర్ చెప్పారు. కానీ, 299 టీఎంసీలకు సీఎం కేసీఆర్ ఒప్పుకున్నారని అబద్ధాలు చెబుతున్నారు. దమ్ముంటే, పలుకుబడి ఉంటే, మోడీకి చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి. సుష్మా స్వరాజ్ హైదరాబాద్‌లో సభ పెట్టి పాలమూరుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు.
''గ్రూప్ -1 పరీక్షలు ఉర్దూలో నిర్వహించొద్దని కొంత మంది నాయకులు వాగ్వాదం చేస్తున్నారు. భారత రాజ్యాంగం ఉర్దూను అధికారిక భాషగా గుర్తించలేదా? యూపీఎస్సీతో పాటు కేంద్రం నిర్వహించే పరీక్షల్లో ఉర్దూ భాష లేదా? అక్కడున్నప్పుడు లేని బాధ ఇక్కడెందుకు వస్తుంది. ఉర్దూను ఒక ముస్లిం భాష, మతం భాషగా చూడటమేనా? పిల్లల మనసుల్లో విషం నింపడమేనా? కొంత మంది నాయకులు దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నారు. ఇదికాదు.. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి'' అని సవాల్ చేశారు.
కొత్తగా ఏర్పడిన నారాయణపేటను ఇతర జిల్లాలకు దీటుగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 82.44 కోట్ల నిధుల అంచనాతో పేట పట్టణంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామని చెప్పారు. బంగారు ఆభరణాలకు పేరుగాంచిన పేటలో వేలాది మంది స్వర్ణకారులు అన్ని సౌకర్యాలతో ఒకే దగ్గర వ్యాపారం చేసుకునే విధంగా గోల్డ్‌స్మిత్ సోప్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, పేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ,్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సత్యనారాయణ, కలెక్టర్ రాజ్యం దాసరి, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.