Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిషన్ భగీరథ ఓ పెద్ద కుంభకోణం
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : బక్క జడ్సన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ పథకంలో పెద్ద కుంభకోణం దాగి ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ పేర్కొన్నారు. ప్రజలకు వందశాతం స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామనేది ఉత్తమాటేనని విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దీనిపై ఇప్పటికే సమగ్ర వివరాలతో తాను కేంద్ర జలవనరులు, నదుల అభివృద్ధి శాఖకు ఫిర్యాదు చేసినట్టు సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై విచారణ కోసం కేంద్ర ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామంటూ సర్కారు మోసం చేసిందని విమర్శించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83,03,612 ఇండ్లు ఉండగా, ప్రస్తుతం 89,49,169 ఇండ్లు ఉన్నాయని తెలిపారు.అయితే రాష్ట్రంలో 56 లక్షల ఇండ్లకు మాత్రమే నీరు వస్తుందనీ, అది 2.72 కోట్ల మందికి మాత్రమే అందుతున్నదని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి వందశాతం తాగు నీరు అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదిక ఇచ్చిందని విమర్శించారు. గ్రామపంచాయతీల్లో మిషన్ భగీరధ నీటిిని బోర్నీటితో కలిపి ప్రజలకు సరఫరా చేస్తున్నారనీ, దీంతో రోగాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1.50 లక్షల కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా గాంధారి, దోమకొండ, బిక్కనూరు, తాడ్వాయి, సదాశివనగర్, మండలాల్లోని గ్రామాలతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 70 శాతం మిషన్ భగీరధ కింద తాగునీరు అందడం లేదనీ, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వంద శాతం ప్రజలకు నీరు అందడం లేదని విమర్శించారు.