Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పులకు సంబంధించి రాష్ట్రంపై కేంద్రం వివక్ష...
- 15వ ఆర్థిక సంఘంలో లేని విషయాలను సైతం అమల్జేస్తున్నారు :
- కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అప్పుల సమీకరణకు సంబంధించి రాష్ట్రాలకు నిబంధనల పేరిట బంధనాలు విధించొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బంధనాలు వేయటమంటే తెలంగాణ పట్ల వివక్ష చూపటమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా అనంతర పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక వనరులను దెబ్బతీసే విధంగా కేంద్రం చర్యలుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అప్పులు తెచ్చుకోవటానికి వీలుగా రాష్ట్రానికి అనుమతులివ్వాలనీ, లేదంటే అభివృద్ధికి ప్రతిబంధకంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం చేయటం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రుణాలు తీసుకునే మార్గదర్శకాలను జారీ చేయటం, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల విడుదల కోసం ఒకే నోడల్ ఏజెన్సీని నమూనాగా ఎంచుకోవటం తదితరాంశాలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం రాష్ట్రాల ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్రం తరపున హైదరాబాద్ నుంచి రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి మాట్లాడుతూ... రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎమ్ పరిమితులకు అదనంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులను సమకూర్చుకుంటున్నాయని చెప్పారు. అలాంటి అప్పులను తమ తమ నిధుల నుంచి రాష్ట్రాలు చెల్లిస్తున్నాయని వివరించారు. వాటిని కూడా రాష్ట్రాల అప్పులుగానే భావిస్తామని తెలిపారు. అనంతరం రామకృష్ణారావు మాట్లాడుతూ... మూలధన వ్యయం కోసం కేంద్రం 2020-21లో రూ.12 వేల కోట్లు, 2021-22లో రూ.15 వేల కోట్లు, 2022-23లో లక్ష కోట్లను రుణాల రూపంలో రాష్ట్రాలకు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇవి ఎఫ్ఆర్బీఎమ్ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. అదే కోవలో తెలంగాణ ప్రభుత్వం... మూలధన వ్యయం కోసం హామీలిచ్చిందని వివరించారు. ప్రధానంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, కాకతీయ కార్పొరేషన్లకు హామీలిచ్చిందని తెలిపారు. ఆయా ప్రాజెక్టులు వివిధ దశలో ఉన్నాయని వివరించారు. అవి పూర్తయితే తప్ప ఆయా కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారెంటీలపై పొందిన రుణాలను తిరిగి చెల్లించలేవని స్పష్టం చేశారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన హడ్కో, ఎన్సీడీసీ ఇచ్చే అప్పులకు సంబంధించిన చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పటికీ, వాటిని రాష్ట్రాల అప్పుల పరిధిలోకి తీసుకు రాలేదని తెలిపారు. ఈ విధంగా కొన్ని అప్పులను ఎఫ్ఆర్బీఎమ్ పరిధిలో చూపటం, మరికొన్నింటిని చూపకపోవటం వివక్షేనని ఆవేదన వ్యక్తం చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అప్పుల సమీకరణకు ఇప్పటి వరకూ అనుమతించకపోవటం సరికాదని ఆయన అన్నారు. మరోవైపు 15వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫారసులు చేయనప్పటికీ కేంద్రం అకస్మాత్తుగా 'ఆఫ్ బడ్జెట్' అప్పులను రాష్ట్రాల అప్పులుగా తీసుకుంటామంటూ చెప్పటం కక్షపూరిత చర్యగా ఆయన అభివర్ణించారు.