Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పెరిగిన వాహన రిజిస్ట్రేషన్ చార్జీలు
- లైఫ్ ట్యాక్స్ కూడా...
- ధరల పెంపులో కేంద్రంతో పోటీపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సామాన్యుల్ని ఆర్థికంగా బాదేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ప్రజల్ని గందరగోళపరిచేందుకు వీళ్లిద్దరూ మళ్లీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్టు విమర్శ, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సహా అనేక ధరల్ని కేంద్రం పెంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి పోటీగా ఆర్టీసీ, కరెంటు చార్జీలు పెంచింది. తాజాగా వాహనాల రిజిస్ట్రేషన్, జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న రేట్లకంటే మూడు శాతం పెంచేసింది. దీనిలో వికలాంగుల ట్రై సైకిళ్లకూ మినహాయింపు ఇవ్వలేదు. అలాగే నిర్ణీత గడువులోపు వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే భారీగా జరిమానాలు విధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త బైక్‌లు, స్కూటర్లు, ట్రైసైకిళ్లు కొంటే ప్రస్తుతం 9 శాతం ఉన్న పన్నును 12 శాతానికి పెంచారు. ఇన్‌వ్యాలీడ్ క్యారేజ్ ట్యాక్స్‌ను రూ.930కి పెంచారు. అలాగే అన్ని రకాల వాహనాల పన్నుల్ని 9 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. వాహనాల ఖరీదును బట్టి పన్ను రేట్లు నిర్ణయించారు. ఆటోలు, కార్లు, జీపులు, క్యాబ్‌ల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచారు. రూ.5 లక్షల లోపు ఖరీదైన వాహనాలకు 13 శాతం, రూ.10 లక్షల లోపు ఖరీదైన వాహనాలకు14 శాతం, రూ.20 లక్షల లోపు ఖరీదైన వాహనాలకు 17 శాతం, రూ.20 లక్షలు అంతకు మించి ఖరీదైన వాహనాలకు 18 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలుగా నిర్ణయించారు. వివిధ సంస్థలు తమ అవసరాల కోసం కొనుగోలు చేసే 10 సీట్లకు మించని సొంత వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలు వాహన ఖరీదును బట్టి 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంచారు. ఓవైపు పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో నానా తిప్పలు పడుతున్న ప్రజలపై ఈ పన్నులు మరింత ఆర్థికభారాన్ని మోపుతున్నాయి.