Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదన్న కారణంతో ఓ ప్రేమ జంట బయటికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం అన్నారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుల కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం చెరుకుపల్లి శివారులోని తురకలగూడెంకు చెందిన మడకం సోనా (20), ములకలపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ ధర్మాన్ననగర్కు చెందిన వూకే దేవి(18) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దేవికి ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి సంబంధం కుదర్చడంతో మనస్తాపం చెందిన వారు మూడు రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అటుగా వెళ్లిన స్థానికులు అన్నారం శివారు అటవీప్రాంతంలో రెండు మృతదేహాలు ఉన్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల వద్ద పురుగుమందు డబ్బా ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. స్థానికుల ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచకు తరలిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా ఇరు కుటుంబాలు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వలసవచ్చి వేర్వేరు ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నట్టు తెలిసింది. అయితే ఆ ఇరుకుటుంబాల వారు కూడా దగ్గరి బంధువులు కావడం కొసమెరుపు.