Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయంగా ఆ కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా దేశంలో తన కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకున్నట్టు తెలిపింది. ఈ ఏడాదికి ఇక్కడి నుంచి సుమారు వెయ్యి మంది ఉద్యోగులు కంపెనీ కోసం పనిచేయనున్నట్టు తెలిపింది. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి కెటి రామారావుతో ఆ కంపెనీ సీఈవో లియోనార్డ్ లివ్చిట్జ్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాలతోపాటు అద్భుతమైన ఏ గ్రేడ్ కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. అన్నిటికన్నా ప్రధానంగా ఉన్నత విద్యాప్రమాణాలు, నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు అందుబాటులో ఉన్నారని వివరించారు. అందుకే ఈ కంపెనీ విస్తరణ ప్రణాళికలకు భారత్‌లో హైదరాబాద్‌ను ఎంచుకున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి బహుళజాతి సంస్థలను ఆకర్షించడంలో హైదరాబాద్ తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నదని మంత్రి కెటి రామారావు తెలిపారు. గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆ కార్యకలాపాల నిర్వహణ కోసం అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ సహాయ సహకారాలను అందిస్తుందని వివరించారు.