Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
నవతెలంగాణ -నకిరేకల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి కొనుగోలులో అవకతవకలను అరికట్టి సకాలంలో కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో నాలుగు కిలోల వరకు కోతపెట్టడాన్ని ఆపాలని, హమాలు చార్జీలు ఎక్కువగా వసూలు చేసే విధానాన్ని ఆపాలని, గన్నీ బ్యాగులు తగినన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కొనుగోలు చేసిన వెంటనే రైతులకు డబ్బులు చెల్లించాలనీ, ధరణి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం కౌలు కార్డులు ఇవ్వాలన్నారు. ఈ అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల చివరి వరకు మండల, జిల్లా స్థాయిలో ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కున్రెడ్డి నాగిరెడ్డి, మహిళా రైతుల రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, వెంకటయ్య, చలకని మల్లయ్య, నూనె గట్టయ్య, కరింగుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.