Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.102 కోట్లతో అభివృద్ధి పనులు
- జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు
- పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తాం: మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా హెల్త్ హబ్‌గా మారనున్నదనివైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం జిల్లాలో రూ.102కోట్లతో వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన పలు అభివృద్ధి పనులకు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. వైద్యపరంగా ప్రభుత్వం జిల్లాలో అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నట్టు తెలిపారు. దాదాపు రూ.6కోట్లతో రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్లతో 56 రకాల పరీక్షలు పైసా ఖర్చు లేకుండా చేయడానికి ఏర్పాటు చేసుకున్నామన్నారు. చిన్న పిల్లల కోసం న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్, ఐసీయూ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఇంకా ఆల్ట్రా సౌండ్, మెమెగ్రఫీ, టూ డీ ఎకో వంటి పరీక్షలు ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశామన్నారు. సిటీ స్కాన్ మిషన్ మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. వారం రోజుల్లో డయాలసిస్ కేంద్రం మంజూరు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరైందని, ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున 40 ఏఎన్ఎం సబ్ సెంటర్లకు రూ.8కోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. పీడియాట్రిక్ ఐసీయూ 200 పడకల ఆస్పత్రిలో అందుబాటులోకి తెస్తామన్నారు. 75 ఏండ్లలో ప్రస్తుత ప్రభుత్వం రాక ముందు భూపాలపల్లిలో ఒక్క పీహెచ్సీ ఉండేదని, ఇప్పుడు పీహెచ్సీలో 10 పడకలకు ఒక్క డాక్టర్ ఉంటే, మెడికల్ కాలేజీకి 150 మంది డాక్టర్లు, 650 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆస్పత్రుల్లో సీ సెక్షన్ ఆపరేషన్లు ఎక్కువగా చేస్తున్నారని, ఇది మహిళలకు, పుట్టే పిల్లలకు మంచిది కాదని, సాధారణ డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముహుర్తాలు, మంచి రోజులు అని, ఆపరేషన్లకు బలవంతం చేస్తున్నట్టు తెలిసిందని, అలాంటివి మానుకోవాలన్నారు. ఇక్కడి జెడ్పీ చైర్పర్సన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ భార్య, ఎస్పీ భార్య ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగాయని గుర్తుచేశారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30శాతం మాత్రమే ప్రసవాలు జరిగేవని, తెలంగాణ వచ్చాక 56 శాతానికి పెరిగాయన్నారు. భూపాలపల్లి జిల్లాతో పాటు 8 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని వచ్చే నెల రోజుల్లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్క, పాము కాటుకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలన్నారు. కరోనా సమయంలో ఆశాలు, ఏఎన్ఎంలు కష్టపడ్డారని, అందుకే వారి వేతనాలు పెంచారని, ఇంకా కష్టపడితే మరింత పెంచమని సీఎంను కోరతామని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్లు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, రాష్ట్ర వైద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మెన్ శ్రీనివాస్, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మెన్ వాసుదేవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.