Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల నిర్వాకంతో విద్యార్థులకు తిప్పలు
- కోదాడలో ఇంగ్లీష్ ప్రశ్నాపత్రానికి బదులు కెమిస్ట్రీ అందజేత
- విద్యార్థులు ఇదేంటని ప్రశ్నించడంతో నాలుక్కరుచుకున్న ఇన్విజిలేటర్లు
- గంటన్నర ఆలస్యంగా పరీక్ష ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. విధుల పట్ల, విద్యార్థుల జీవితాల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తేటతెల్లమైంది. వారి నిర్వాకంతో విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. సోమవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ పేపర్-1 నిర్వహించాలి. ఇది అందరికీ తెలిసిందే. కానీ సూర్యాపేట జిల్లా కోదాడలో ఉన్న సిటీ సెంట్రల్ జూనియర్ కాలేజీకి చెందిన చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారి (డీవో)తోపాటు ఇతర అధికారులకు మాత్రం తెలియదు. సీసీ కెమెరాల నిఘాలో ప్రశ్నాపత్రాన్ని ఓపెన్ చేయాలి. మరి వారు సీసీ కెమెరా నిఘాలో ఓపెన్ చేశారా? లేదా? అన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రశ్నాపత్రానికి బదులుగా కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం ఇచ్చారు. దీన్ని సీఎస్, డీవోసహా ఇన్విజిలేటర్లు ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. విద్యార్థులకు ఆ ప్రశ్నాపత్రం ఇచ్చిన తర్వాత అయోమయానికి గురయ్యారు. 'ఇదేంటి... ఈ రోజు ఇంగ్లీష్ పరీక్ష అయితే కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం ఇచ్చారేంటీ?'అని విద్యార్థులు ప్రశ్నించారు. వెంటనే ఇన్విజిలేటర్లు, అధికారులు నాలుక్కరచుకుని కెమిస్ట్రీ ప్రశ్నాపత్రాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో గంటన్నర ఆలస్యంగా ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాలను తెప్పించి మళ్లీ పరీక్ష నిర్వహించారు. దీన్ని బట్టి ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది. విద్యార్థుల జీవితాలు, పరీక్షలంటే లెక్కలేదని తెలుస్తున్నది. విధుల పట్ల ఎంత అలసత్వం ప్రదర్శిస్తున్నారో ఈ ఘటనను బట్టి అర్థమవుతున్నది. ఈనెల ఆరో తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శుక్రవారం సంస్కృతం ప్రశ్నాపత్రంలో తప్పులు వచ్చాయి. ఆ తర్వాత శనివారం నిర్వహించిన తెలుగు, ఉర్దూ ప్రశ్నాపత్రంలోనూ తప్పులు దొర్లాయి. కరోనా నేపథ్యంలో రెండు విద్యాసంవత్సరాలుగా విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో నేర్చుకున్నవి మర్చిపోవడం వల్ల పాఠాలు సరిగ్గా అర్థం కాని పరిస్థితి నెలకొంది. రెండు విద్యాసంవత్సరాల తర్వాత వార్షిక పరీక్షలు జరుగుతున్నది ఇప్పుడే. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు విద్యావేత్తలు, అధ్యాపక, కాంట్రాక్టు అధ్యాపక సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ చేపట్టాలనీ, సీసీ కెమెరాలను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రింటర్ ద్వారా తప్పుడు బండిల్ సరఫరా : ఇంటర్ బోర్డు
సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ పరీక్షా కేంద్రంలో ప్రింటర్ ద్వారా తప్పుడు బండిల్ సరఫరా చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్-1ను 1,443 పరీక్షా కేంద్రాల్లో 4.62 లక్షల మంది విద్యార్థులకు నిర్వహించామని పేర్కొన్నారు. ఆ తప్పుడు బండిల్‌ను తెరవలేదని తెలిపారు. జిల్లా బల్క్ నుంచి సరైన ప్రశ్నాపత్రాన్ని సమీపంలోని పరీక్షా కేంద్రాల నుంచి విడి పత్రాలను పొందడం ద్వారా సరిదిద్దామని వివరించారు. ఈ కేంద్రంలోని విద్యార్థులను పరీక్షా హాలులోనే కూర్చొబెట్టి గంటపాటు ఆలస్యంగా పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఆ కేంద్రంలోని విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు మూడు గంటలపాటు సమయం కేటాయించామని వివరించారు. ఈ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,64,685 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా,ఇంగ్లీష్ పేపర్-1పరీక్షకు4,41,374 (95 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 23,311 (5 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.
గంటన్నర ఆలస్యంగా ఇంటర్ పరీక్ష
ప్రశ్నాపత్రాలు తక్కువగా రావడంతో..
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంటర్ పరీక్షాపత్రం ఆలస్యంగా ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఏలూరు ఇంటర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించారు. సిటీ సెంట్రల్ జూనియర్ కళాశాలలో 243 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం అధికారులు పరీక్షాపత్రం ఓపెన్ చేయడంతో కొన్ని పరీక్షాపత్రాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.వెంటనే సూర్యాపేటలోని మూడు కళాశాలల నుంచి 45 ప్రశ్నాపత్రాలను తెప్పించడంతో పరీక్ష గంటన్నర ఆలస్యమైందని జిల్లా ఇంటర్ బోర్డ్ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు 12 గంటలకు బయటకు రావాల్సి ఉండగా.. సమయం గడుస్తున్నా ఇంకా రాకపోయేసరికి తల్లిదండ్రులు కంగారుపడ్డారు. దీంతో సెంటర్ ముందు ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది.