Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రజెండానే పేదలకు అండ
- ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకెళ్తాం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి, మతోన్మాద విధానాలతో రాబోయే ఎన్నికల్లో లబ్దిపొందాలని బీజేపీ కుటిలయత్నాలకు పాల్పడుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆ మతోన్మాద శక్తులకు తెలంగాణలో చోటు ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. సోమవారం రాజన్న సిరిసిల్లలో జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అధ్యక్షతన సీపీఐ(ఎం) జిల్లా స్థాయి ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. దేశంలో త్వరలో జరుగనున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మతవిద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటోందని, మన రాష్ట్రాన్ని కూడా మతోన్మాద ప్రయోగశాల చేయడానికి తద్వారా లబ్దిపొందడనికి ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. బీజేపీ విధానాలు.. పాలన ద్వారా దేశానికి, రాష్ట్రానికి.. పేదలకు ఏమి చేశారో.. చేస్తారో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పరని, కేవలం మతవిద్వేషాలు రెచ్చగొడుతూ పరుష పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నారని, పేదల ఉపాధి హక్కును, దళిత, గిరిజన, బలహీన వర్గాల రిజర్వేషన్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున లేస్తే దేశభక్తి గురించి వల్లిస్తూ మరోవైపు ఎయిర్లైన్స్, రైల్వే వంటి కీలక రవాణా సంస్థలను అమ్మేశారని విమర్శించారు. బీజేపీ మతోన్మాద ప్రమాదాన్ని నిలువరించడానికి ప్రజాల్లో దేశ సమైక్యత భావాలను పెంచడానికి కృషిచేయాలని ఇటీవల కేరళలో జరిగిన తమ పార్టీ ఆలిండియా మహాసభలో తీర్మానించినట్టు తెలిపారు. రాష్ట్రంలో వరుసగా జరిగిన 70 కులదురహంకార హత్యలపై ఏనాడూ నోరువిప్పని బీజేపీ ఇప్పుడు నాగరాజు హత్యను మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు వాడుకుం టోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగరాజు హత్యను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేసిందని చెప్పారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులు సామాజిక తరగతులతో కలిసి విధాన ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఎర్రజెండా నిర్మించిన ప్రజాఉద్యమాల వల్లే పేదలకు కొద్దిమేరకైనా ప్రయోజనాలు దక్కాయని వివరించారు. సిరిసిల్ల జిల్లాలో ఒకప్పుడు ఎర్రజెండా వైభవంతో ఉండేదని, దానిని తిరిగి సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పోరాటాలు నిర్వహించాలని చెప్పారు. పార్టీ నిర్మాణాన్ని పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.