Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యవేక్షణ పోస్టులను మాకు పదోన్నతుల ద్వారా ఇవ్వాలి : మంత్రి సబితకు జీటీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉమ్మడి సీనియార్టీ, ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం (జీటీఏ) స్పష్టం చేసింది. తమకు పదోన్నతుల ద్వారా ఇవ్వాలని విద్యాశాఖలోని పర్యవేక్షణ అధికారుల పోస్టులను డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని సోమవారం హైదరాబాద్‌లోని జీటీఏ అధ్యక్షులు కాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మేరోజు బ్రహ్మచారి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అనేక ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న పర్యవేక్షణ పోస్టులను ఇకనైనా పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలనీ, విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఉపాధ్యాయులను ఏకీకృతం చేస్తూ తెచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించిందని గుర్తు చేశారు. అనేక రాష్ట్రాల్లో ఏకీకృత సర్వీస్ కానీ, ఉమ్మడి సీనియార్టీ కానీ లేవని తెలిపారు. ప్రధానోపాధ్యాయుల పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వులలో మల్టీ జోన్లో చేర్చలేదని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పోస్టును మల్టీజోన్ పరిధిలో ఉంచడం ప్రస్తుత రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇటు జిల్లా స్థాయిలో కానీ, అటు మల్టీ జోనల్ స్థాయిలో కానీ స్థానిక సంస్థల ఉపాధ్యాయుల సర్వీస్‌ను, సీనియార్టీని ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలపడానికి చట్టం ఒప్పుకోవడం లేదని వివరించారు. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం విద్యను మాధ్యమిక స్థాయి వరకు ఆయా స్థానిక సంస్థలే చేపట్టాలని పేర్కొనడమే అందుకు ప్రధాన కారణమని తెలిపారు. పంచాయతీ రాజ్ చట్టానికి పార్లమెంట్లో సవరణ జరగకుండా స్థానిక సంస్థల పాఠశాలలను ప్రభుత్వ పరిధిలోకి తేవడం సాధ్య పడదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఉపాధ్యాయుల క్యాడర్లను దేశానికంతటికీ వర్తించే పంచాయతీ రాజ్ చట్టంలో మొదట రద్దు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ పార్లమెంట్ చేయాలని తెలిపారు. రద్దయిన క్యాడర్లను రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాష్ట్రప్రభుత్వం పరిధిలోకి తేవాలని వివరించారు. ఇవన్నీ జరిగేదాకా విద్యా శాఖలో పదోన్నతులు స్థానిక సంస్థలకు వర్తించబోవని స్పష్టం చేశారు. దీంతో స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు వారి మాతృ సంస్థలోనే పదోన్నతులు సృష్టించి ఇస్తే బాగుంటుందని సూచించారు. త్వరలోనే విద్యాశాఖ కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అన్ని విషయాలూ అక్కడ చర్చిద్దామన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీటీఏ అసోసియేట్ అధ్యక్షులు కె దశరథ్, కోశాధికారి బి సైదులు, సంయుక్త కార్యదర్శి కిషోర్, నాయకులు నవీన్, గంగాధర్, నర్సిములు, బాశెట్టి నాగవేందర్, హైదరాబాద్ నర్సింహా తదితరులు పాల్గొన్నారు.