Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుక్కెడు.. గుక్కెడు నీళ్లు తాగుకుంటూ పనిచేస్తున్నాం
- ఎర్రటెండలో నాలుగు కిలో మీటర్లు కాలినడక
- మూడు నెలలుగా పనిచేయడం తప్ప డబ్బులు ఇచ్చింది లేదు
- వడ్డీలకు అప్పులు తెచ్చి పూట గడుపుతున్నాం
- అధికారులు మా గోడు పట్టించుకుంట లేరు
- ఆందోళనలో ఉపాధి కూలీలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'మండుటెండలో గుక్కెడు.. గుక్కెడు నీళ్లు తాగుకుంటూ.. చేతులు బొబ్బలొచ్చేలా పనిచేసిన ప్రభుత్వం మాపై కనికరం చూపడం లేదు. మూడు నెలలుగా చేసిన కష్టానికి చిల్లీ గవ్వ ఇవ్వలేదు. ఏ అధికారిని అడిగిన ఇగో వచ్చే.. అగ వచ్చే అంటుండ్రే తప్ప డబ్బులిచ్చింది లేదు. కనీసం చేసిన కష్టానికి రోజు వారిగా ఎన్ని డబ్బులు పడుతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తెచ్చుకొని తింటూ సర్కారు పనిచేస్తున్నాం. ఈ పని విడిసి మరో పని చేద్దామంటే పని దొరకడం లేదు. ఇంటి దగ్గర ఉంటే పూటగడిసేట్టు లేదు. కరోనా ప్రభావంతో మా బతుకులు ఆగమాగం ఉన్నాయని, సర్కారు మా గోస చూసైన సకాలంలో కూలీ డబ్బులు చెల్లించాలని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీలో జాబ్ కార్డులు 2,45,737 ఉండగా కూలీలు 7,11,676 మంది ఉన్నారు. ఇందులో రంగారెడ్డిలో 1,57,952 జాబ్ కార్డులు, కూలీలు 2,88,580 ఉండగా, వికారాబాద్‌లో జాబ్‌కార్డులు 87,785, కూలీలు 4,23,096 మంది ఉన్నారు. వీరిలో నిర్విరామంగా ఉపాధి కూలీ పనులకు వెళ్లేవారు సుమారు 2 లక్షల మంది ఉన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్త్తుతం ఉమ్మడి జిల్లాలో 3.52 లక్షల మంది ఉపాధి కూలీ పనులు చేస్తున్నారు. వారికి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కూలీ డబ్బులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. నాలుగు నెలలుగా ఒక్క పైసా చెల్లించలేదు. దాంతో పూటగడువక కూలీలు ఆకలితో అల్లాడిపోతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఇటీవల నవతెలంగాణ ప్రతినిధి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం గంగాపురం, సిరిగిరిపూర్ గ్రామాల్లో ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడగా.. వారి ఆవేదనలు కట్టలు తెచ్చుకున్నాయి. 'మైలరాయి తండా నుంచి పని ప్రదేశానికి 4కి.మీ కాలినడక వస్తున్నా. ఉదయం ఇంటి నుంచి 6 గంటలకు వెళ్లితే తప్ప ఎండ తీవ్రత ఎక్కువయ్యే సరికి ఇంటికి తిరిగి రావొచ్చు. అధికారులు ఇంకుడు గుంతలు తవ్వడం పని పెట్టిండ్రు.. ఎండలకు నేల గట్టిబారింది. పెల్లకూడా కదలడం లేదు. తొవ్వితొవ్వి రెక్కలు ముక్కలవుతున్నాయి. ఇద్దరం కలిసి రోజూ ఐదు ఫీట్ల పొడవు.. ఫీటు లోతు గుంత తొవ్వుతున్నాం. సర్కారు పెట్టిన లెక్క ప్రకారం పనిచేస్తున్నాం. కానీ పైసలు మాత్రం వంద దాటడం లేదు. చేసిన పనికి ఎన్ని డబ్బులు పడినవో కూడా తెలియడం లేదు. నెల పది రోజుల నుంచి పని చేస్తున్న ఇప్పటికీ రూపాయి రాలేదు' అని రమవత్ దేవి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా అనేక మంది ఉపాధి కూలీలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైన సర్కారు మా బాధలు చూసి సకాలంలో కూలీ డబ్బులు చెల్లించి.. అప్పుల బాధ నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
తాగునీటి కోసం అల్లాడుతున్న కూలీలు
ఇంటి నుంచి పని ప్రదేశాలకు ఏ ప్రాంతానికి వెళ్లిన మూడు నాలుగు కిలో మీటర్ల దూరం ఉంటుంది. పని ప్రదేశంలో తాగునీటి వసతి లేకపోవడంతో ఉదయం ఇంటి నుంచి తీసుకువెళ్లిన డబ్బా నీళ్లతో సరిపెట్టుకోవాలి. ఉదయం 8 గంటల నుంచి భానుడు భగ్గుమండుతుండటంతో ఇంటి నుంచి తీసుకెళ్లిన నీళ్లు పనిలోకి వెళ్లిన గంటలో తాగేస్తున్నారు. మళ్లీ దాహం వేస్తే పని ప్రదేశంలో చుక్క నీళ్లు దొరకని పరిస్థితి. కిలోమీటర్ల దూరం వెళ్లి బోరు బావి వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మహేశ్వరం మండలం గంగారంతండా వాసులు ఫారెస్టు భూముల్లో ఉపాధి పనులు చేస్తున్నారు. ఆ తండా నుంచి పని ప్రదేశానికి 4 కి.మీ ఉంది. చుట్టూ పక్కల బోరు బావులు లేకపోవడంతో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధి కూలీలు ఉదయం ఇంటి నుంచి తెచ్చుకున్న నీటినే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇందుకు ఇక్కడి కూలీలు దాహం వేస్తే గొంతు తడుపుకోవడం తప్ప దాహం తీరేలా నీళ్లు తాగడం లేదు. పొరపాటున ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్లు పని మధ్యలో అయిపోతే.. గొంతు తడుపుకోవడానికి కూడా గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. ఇటీవల ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కైరబాయి తాగు నీరు లేక సొమ్మసిల్లిపోయిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పని ప్రదేశాల్లో తాగునీటి వసతి కల్పించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
ఆరు నెలలుగా కూలీ డబ్బులు రాలే
భార్యభర్తలం ఇద్దరం ఉపాధి కూలీ పని చేస్తున్నాం. ఆరు నెలలు నుంచి నయాపైసా రాలేదు. తెలిసిన వారి దగ్గర అప్పుతెచ్చుకొని తింటున్నాం. ఎన్నాండ్లని ఇట్ల అప్పులు చేయాలి. అధికారులు పనిచేయిస్తుండ్రు తప్ప కూలీ డబ్బులు ఇప్పించడం లేదు. సర్కారు చెప్పిన కూలీ ప్రకారం నాకు ఇప్పటికి రూ. 30 వేలు రావాలి.
- సత్యానారాయణ, సరిగిరిపూర్ గ్రామం, ఉపాధి కూలీ
బంగారం తాకట్టుపెట్టిన..
మా భార్య బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని తింటున్నాం. మూడు నెలల నుంచి ఉపాధి పని చేస్తున్న రూపాయి రాలేదు. ఇంటి నుంచి పనికి రావాలంటే ప్రతిరోజు 4 కి.మీ రావాలి. ఎండలకు నడవ లేక బండి తెస్తే.. రెండు రోజులకు రూ. 100 పెట్రోల్ పోయాల్సి వస్తుంది. వారం.. వారం గడ్డపార పదునుకు రూ. 300 ఖర్చు వస్తోంది. ప్రభుత్వం మాత్రం మాకు ఇచ్చే కూలీ రూ. 150 దాటడం లేదు. వచ్చే పైసలైన టైమ్‌కు ఇవ్వడం లేదు. అధికారులు స్పందించి డబ్బులు వెంటనే చెల్లించే విధంగా చూడాలి.
- మల్లేశ్ నాయక్, మైలరాయి తండా ఉపాధి కూలీ
సకాలంలో ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించాలి
గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనిచేస్తున్న కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు చెల్లించాలి. పని ప్రదేశంలో కూలీలకు మౌలిక వసతులు కల్పించాలి. తాగునీటి వసతి లేక ఫారెస్టు భూముల్లో పనిచేస్తున్న కూలీలు సొమ్మసిల్లిపడిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే పని ప్రదేశాల్లో టెంట్, తాగునీటి వసతులు ఏర్పాటుచేయాలి. కూలీలకు రోజువారిగా వారు చేసిన కష్టానికి ఎన్ని డబ్బులు వస్తున్నాయే పే స్లిప్ ఇవ్వాలి.
- కె. జగన్, తెలంగాణ వ్యవసాయ
కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి