Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాటల్లోనే బీసీ, ఎంబీసీల సంక్షేమం రుణాల కోసం నిరీక్షణ
- 5.7లక్షల దరఖాస్తులు పెండింగ్‌లోనే
- వృత్తి ఫెడరేషన్లు నిర్వీర్యం
ఎస్ వెంకన్న
బీసీ, ఎంబీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లద్వారా వృత్తిదారులను, యువతను ఆదుకుంటామంటూ గతంలో ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అయితే వారి మాటలు నీటి మూటలయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగిసినా ఇప్పటికే ఫెడరేషన్లకు పైసా కూడా విడుదల కాకపోవటమే ఇందుకు నిదర్శనం, అయితే స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న యువత ఈ సారైనా రుణాలు రాకపోతాయా? అని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ తీరు చూస్తే ఈ సారి కూడా వారికి రుణాలు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. బీసీల సంక్షేమం గురించి గొప్పలు చెబుతున్న సర్కారు..వారికి కేటాయించిన నిధులను ఖర్చుచేయకుండా వేరే శాఖలకు దారి మళ్లిస్తున్నారంటూ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
వృత్తుల అభివృద్ధిపట్ల నిర్లక్ష్యం..
బీసీ, ఎంబీసీల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాటలతో సరిపుచ్చుతున్నది. కాలం వెళ్లదీస్తున్నది.దీంతో వెనుకబడిన కులాల, వృత్తుల అభివృద్ధి పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు నిధులను కేటాయించలేదు. 2021-22లో మాత్రం బీసీ, ఎంబీసీ కార్పొరేషన్‌కు చెరో రూ. 500 కోట్ల చొప్పున బడ్జెట్లో మొత్తం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తున్నదో అని మార్చిలో బీసీ కార్పొరేషన్‌కు రూ. 250 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.250 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో9) ఇచ్చినట్టు తెలిసింది. కానీ వీటిని కూడా పీడీ అకౌంట్లోకి పంపలేదు. దీంతో బీఆర్వో ఇచ్చినా ఖర్చు చేయటానికి అవకాశం లేకుండా పోయిందని వృత్తిదారులు వాపోతున్నారు. మొత్తం రూ. వెయ్యి కోట్లలో కనీసం రూ.500 కోట్లు అయినా వస్తాయనుకుంటే అవి కూడా రాకపోవటంతో వారు నిరాశలో కూరుకుపోయారు.
ఎంబీసీల పట్లా నిర్లక్ష్యమే.. ఎంబీసీ కార్పొరేషన్‌కు ఏటా నిధులు
కేటాయిస్తున్నా పైసలు మాత్రం ఖర్చు చేయటంలేదు. బడ్జెట్లో రూ. వేల కోట్లు కేటాయిస్తున్నా లబ్ధిదారులకు ఇప్పటి దాకా రూ. 7.10 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ఎంబీసీలకు ఏటా రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని గతంలో ఎంబీసీల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. తర్వాతి బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించినా.. రూ. 350 కోట్లకు మాత్రమే ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇచ్చింది. అందులోంచి అసెంబ్లీ ఎన్నికల ముందు రూ. 7.10 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక 2018-19లో రూ. వెయ్యి కోట్లు, 2019-20లో జీరో కేటాయింపులు, 2020-21, 2021-22 బడ్జెట్లో రూ. 500 కోట్ల చొప్పున కేటాయించారు. కానీ రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మొత్తంగా రూ. మూడు వేల కోట్లు కేటాయిస్తే.. ఇప్పటిదాకా కనీసం రూ.10 కోట్లు కూడా లబ్ధిదారులకు ఖర్చు చేయలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆదుకోవాల్సిన బాధ్యత లేదా?
ఫెడరేషన్లకు కేటాయించిన బడ్జెట్లో 85శాతం విద్యకు, ఫీజులకు, ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయాల నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు. పేరుకు గొప్పగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పటం, ఆచరణలో ఖర్చు చేయకపోవటం సర్కారుకు ఆనవాయితీగా మారింది. రాష్ట్ర జనాభాలో 25శాతం మంది 42 వృత్తుల వారు జీవిస్తున్నారు. వీరంతా స్వయం ఉపాధిపై బతుకుతున్నారు. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? 2018 టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఏటా రూ.10వేల కోట్లు బీసీ కార్పొరేషన్‌కు కేటాయిస్తామని ప్రకటించారు. వృత్తులను ఆధునీకరిస్తామన్నారు. పని కోల్పోయిన వారికి ఉపాధి కల్పిస్తామన్నారు. సంచార జాతులను స్థిరపరుస్తామని చెప్పారు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు.
- పైళ్ల ఆశయ్య, ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం
జీఓ 190 అమలేది?
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధికి రుణాలు అందిస్తామంటూ 2018లోనే ప్రభుత్వం 190జీఓను విడుదల చేసింది. ఆ జీఓ నిబంధనలకు అనుగుణంగా నాటి నుంచి నేటి వరకు సుమారు 5.70లక్షల మంది బీసీ తరగతులకు చెందిన, సంచార జాతుల యువకులు, వృత్తిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల దళిత బంధు ప్రకటించటంతో బీసీ యువత, వృత్తిదారులు మాకు కూడా రుణాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం రుణాలు ఇస్తే..ఏదైనా చిన్నపాటి వ్యాపారం పెట్టుకోవచ్చని ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వం అందుకనుగుణంగా స్పందించటం లేదనే విమర్శలు వస్తున్నాయి. 2018 తర్వాత ఒక్కరికి కూడా పైసా రుణం ఇవ్వలేదు. ఈ ఏడేండ్ల కాలంలో లక్ష మందికి రూ. 50వేల చొప్పున మాత్రమే రుణాలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంకా 4.70లక్షల దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి.